Tuesday, September 17, 2024
HomeTrending NewsBabu: పులివెందులలో టిడిపి జెండా నా చిరకాల వాంఛ: చంద్రబాబు

Babu: పులివెందులలో టిడిపి జెండా నా చిరకాల వాంఛ: చంద్రబాబు

ప్రస్తుతం ఉన్న పంటల బీమా పథకాన్ని రద్దు చేసి పాత విధానాన్నే పునరుద్దరిస్తామని, పులివెందులలో మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా పులివెందులలో జరిగిన బహిరంగ సభలో బాబు ప్రసంగించారు.  భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, ప్రజలే సొంతంగా కరెంట్ ఉత్పత్తి చేసుకొనేలా తాము సహకారం అందిస్తామని, టెక్నాలజీ సాయంతో గ్రిడ్ కనెక్టివిటీ గురించి తాను ఆలోచిస్తానని వెల్లడించారు.

తనను వృద్ధ సింహం అంటూ మాట్లాడుతున్నారని, తన విషయంలో వయసు ఓ నంబర్ మాత్రమేనని, సింహం ఎప్పుడూ సింహమేనని స్పష్టం చేశారు. రాయలసీమకు మేలు చేసిందెవరో, ద్రోహం చేసిందెవరో ఆలోచించాలని… రాయలసీమని రతనాల సీమగా,  హార్టీకల్చర్ హబ్ లా తయారుచేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.

రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని, తెలుగుగంగ ప్రాజెక్టు సమయంలో సీమకు నీరు ఇచ్చిన తరువాతే తమిళనాడుకు ఇస్తామని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.  తమ ప్రభుత్వ హయంలో పులివెందుల రైతాంగానికి నీరు కావాలంటే జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా రెండు టిఎంసిల ద్వారా నీరు ఇచ్చి ఆదుకున్నామని, అందుకే చీనీ రైతులు ఇక్కడకు వచ్చినప్పుడు భారీ గజమాల వేసి సత్కరించారని సంతోషం వ్యక్తం చేశారు.  పోలవరం ద్వారా గోదావరి జలాలు నాగార్జున సాగర్ ద్వారా నల్లమల ద్వారా 32 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వి బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా సీమకు పుష్కలంగా నీరు అందించవచ్చని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే గండికోట వద్ద విజయనగర సామ్రాజ్య అధినేత  శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఆంబోతులా మాట్లాడుతునారని, ఆయన తన శాఖ గురించి పట్టించుకోకుండా బ్రో సినిమా పై మాట్లాడుతున్నారని,  ‘నువ్వు మంత్రివా బ్రో సినిమాలో నటించిన బ్రోకర్ వా’ అని ప్రశ్నించారు.

గతంలో కూడా పులివెందులకు ఎన్నోసార్లు వచ్చానని, కానీ ఈరోజు ప్రజల స్పందన ఎన్నడూ చూడలేదని, ఈ జన సందోహం చూస్తుంటే ఇక్కడ కూడా తిరుగుబాటు మొదలైందని, అందుకే తమ తమ పార్టీ నేతలు వై నాట్ పులివెందుల అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఎగతాళి చేశా కాబట్టే పులివెందులలో బస్టాండ్ కట్టారని, లేకపోతే అది కూడా కట్టేవారు కాదన్నారు.

సిఎం జగన్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేనివాడు మూడు రాజధానులు కడతారా అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో, మద్యం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని, జగన్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదని, వాలంటీర్ల ద్వారా కుటుంబ విషయాలు సేకరిస్తున్నారని.. ఈ సమాచారం ఎందుకని ప్రశ్నించారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. నిజంగా వాలంటీర్లు ఉపయోగ పడితే వారిని తీయబోమని, ప్రజలకు ద్రోహం చేసే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

జగన్ కుప్పం వెళ్లి మాట్లాడుతున్నారని, తాము కూడా వై నాట్ పులివెందుల అనే నినాదం ఇస్తున్నామని, బి టెక్ రవి ఇక్కడ బులెట్ లా దూసుకు పోతారని, పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలన్నది తన చిరకాల వాంఛ అని, వచ్చే ఎన్నికల్లో బిటెక్ రవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్