వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైన మొదటిరోజు నుంచీ చంద్రబాబు వారిపై కక్ష కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుడి ఇంటికే చేర్చేందుకు వైఎస్ జగన్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని… వాలంటీర్లు ప్రజలను ప్రభావితం చేస్తారన్న నెపంతో ఎన్నికల కోడ్ పేరుతో చంద్రబాబు దీన్ని నిలుపుదల చేయించారని, తనకు సంబంధం లేదని ఆయన చెప్పినా జనం నమ్మబోరని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.
ఇలాంటి ఛండాలమైన పని నేరుగా చేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలిసే వేరే వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఈ డ్రామా నడిపించారని… ఒకవేళ ఈ వ్యవస్థ వద్దని అనుకుంటే ఆయనే నేరుగా కోర్టుకు వెళ్ళవచ్చని లేదా ప్రజలకు ఈ వ్యవస్థపై తన అభిప్రాయం నేరుగా చెప్పవచ్చని… తాము అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు మళ్ళీ తెస్తామని ఆయన చెప్పి ఉంటే బాగుండేదని… అలా కాకుండా దొంగ దెబ్బ తీశారని సజ్జల మండిపడ్డారు.
ఈ వ్యవస్థపై బాబు, ఆయన దత్తపుత్రుడి అభిప్రాయం ఏమిటో అందరికీ తెలుసనీ… ఈ డొంక తిరుగుడు ఎందుకని… సిటిజెన్ ఫర్ డెమోక్రసీ పేరుతో తనకు ఆప్తుడైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంస్థ ఏర్పాటు చేసిన పది రోజుల్లోనే వాలంటీర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారని, ఈ కేసులో అత్యంత ఖరీదైన న్యాయవాది కపిల్ సిబ్బాల్ ను ఈ కేసుకు ఎంగేజ్ చేశారని వెల్లడించారు. నిమ్మగడ్డ చంద్రబాబు కోసమే పని చేస్తారన్న విషయం అందరికీ తెలుసనీ, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఈయన ఎక్కడ ఎవరితో సమావేశం అయ్యారో సాక్ష్యాధారాలతో సహా వెల్లడైందని సజ్జల గుర్తు చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, పొరపాటున అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందనేది ఇప్పుడు తెలిపోయందని.. ఎన్నికల సమయంలోనే ప్రజలకు బాబు గుర్తు చేస్తున్నారని… ఓ వ్యవస్థపై ఇంత కక్ష పూరితంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు.