Ready to sacrifice: జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ఈ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కాకినాడలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల టిడిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ప్రజా ఉద్యమం నిర్మాణం చేయాలని, దానికి టిడిపి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం లాగానే క్విట్ జగన్ ఉద్యమం రావాలని, అవసరమైతే త్యాగాలకు, జైలుకు వెళ్ళడానికి కూడా తాము సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. ప్రతి ఇంటికీ వెళ్లి తలుపు తట్టి చైతన్యం చేసి, వారిని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరం కలిసి కృషి చేస్తే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, పూర్వ వైభవం తీసుకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆత్యాచారాలు, హత్యలపై హోం శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. పదవులు ఇచ్చినట్లే ఇచ్చి వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా నేతల ఆత్మ గౌరవాన్ని సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దగ్గర తాకట్టు పెట్టారని బాబు తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించాలేకపోతోందని విమర్శించారు. పోలీసులు కన్నెర్ర చేస్తే గంజాయి మాఫియా ఉండదు, మహిళలను వేధించే సైకోలు కూడా ఉండరని అన్నారు.
Also Read : ఇంటింటికీ బాదుడే బాదుడు: బాబు