ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలిగిపోతుందని, ఇక్కడ ఈ దుస్థితి రావడానికి సిఎం జగన్ కారణమని, మూడు రాజధానుల పేరిట అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కౌలురైతుల ఆత్మహత్యల్లో, నిరుద్యోగంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం దురదృష్టకరమన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ‘రా కదలిరా’ బహిరంగ సభ తిరువూరులో జరిగింది. ఈ సభలో చంద్రబాబు జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం ౩౦ ఏళ్ళు వెనక్కి పోయిందని, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచిన తర్వాత పాలనను గాడిలో పెడతానని భరోసా ఇచ్చారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని, రైతులకు కూడా ఈ సిఎం న్యాయం చేయలేకపోయారని అన్నారు. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ ఉపయోగపడిందని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే ప్రజలకు ‘రా కదలిరా’ అనే పిలుపును తిరువూరు నుంచి రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నానన్నారు. సైబరాబాద్ నిర్మించింది తానేనని, అదే స్పూర్తితో ఏపీని తీర్చిదిద్ది ఇక్కడి యువతను ప్రపంచంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని బాబు హామీ ఇచ్చారు.
అసమర్ధుడు పాలకుడైతే రాష్ట్రం కొంతవరకూ నష్టపోతుందని, దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోతుందని, అందుకే రాష్ట్రంలో జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని బాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి తాను పరిశ్రమలు తీసుకొస్తే జగన్ గంజాయి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. గెలుపుపై నమ్మకం లేకే ఎమ్మెల్యే అభ్యర్ధులను మారుస్తున్నారని, ఒకచోట గెలవలేని వారు మరోచోట ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. ఎవరైనా తెలిసో తెలియకో వైసీపీకి ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్లేనని, రాష్ట్రానికి నష్టం చేసినట్లేనని స్పష్టం చేశారు.
టిడిపి-జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, గెలిఛిపోతామన్న ధీమాతో ఇంట్లో కూర్చుంటే మోసపోయేది మనమేనని హెచ్చరించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల మద్దతు కూడగట్టాలని, రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని కోరారు.