Sunday, November 24, 2024
HomeTrending NewsBabu: పుంగనూరు తర్వాత తోక ముడిచారు: బాబు

Babu: పుంగనూరు తర్వాత తోక ముడిచారు: బాబు

రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతో పాటు వరి పంట సాగుకూడా తగ్గిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణాలో సాగు విస్తీర్ణం పెరుగుతుంటే ఏపీలో తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తవుతుందని, వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలంటే మరో 50 ఏళ్ళు పడుతుందని ఎద్దేవా చేశారు.  పుంగనూరు ఘటన తర్వాత అధికార పార్టీ తోక ముడిచినట్లు కనిపిస్తోందని, అందుకే తన పోలవరం పర్యటనకు అంగీకరించి ఉంటారని అన్నారు.  పోలవరం పూర్తి చేస్తామంటూ పలు సార్లు తేదీలు మార్చారన్నారు.

“సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి” కార్యక్రమంలో భాగంగా నేడు పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిరక్ష్యం చేస్తోందంటూ చింతలపూడి వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 4,909 కోట్లతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని,  ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 53 టిఎంసిల గోదావరి వరద జలాలను తరలించేలా దీనికి రూపకల్పన చేశామన్నారు.  అలాంటి ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ హయంలోనే పోలవరం ప్రాజెక్టు పురోగతి ఉందని, 2004-09 వరకూ 5 శాతం పనులే పూర్తయ్యాయ్యని,  గత ఐదేళ్ళ తమ పాలనలో 72శాతం పూర్తి చేశామని, ఈ నాలుగున్నరేళ్ళలో కేవలం 4 శాతం మాత్రమే పూర్తి చేశారని వివరించారు. తాను సిఎంగా ఉండగా 23 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేశామని, 82 సార్లు వర్చువల్ గా పరిశీలన చేశామన్నారు. 2 కిలోమీటర్ల మేర డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేశామని, మొత్తంగా 11,537 కోట్ల రూపాయలు పోలవరం కోసం ఖర్చుచేశామని,  వైసీపీ ప్రభుత్వం 4,611 కోట్లు మాత్రమే వెచ్చించిందని చెప్పారు.

పోలవరం ఎత్తు తాము 45.72 మీటర్లు అంటే వైసీపీ 41.5 అంటోందని; తాము ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దితే వారు నిషేధిత ప్రాంతంగా చేశారని… ప్రాజెక్టుపై వారు వేసిన పుస్తకం అబద్దాలతో కూడుకొని ఉందన్నారు. తమ హయంలో ప్రాజెక్టులో ఎలాంటి తప్పూ జరగలేదని కేంద్రం నివేదిక ఇచ్చిందని,  కానీ వైసీపీ ఎన్నో తప్పులు చేసిందని, వాటిని ఒప్పుకొని… సరిదిద్దుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్