ఉప్పాలవారిపాలెంలో ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మృతదేహాన్ని గుంటూరు జనరల్ ఆస్పత్రికి చేరిన తరువాతనే పోలీసులు స్పందించారని, గుంటూరు చేరుకున్నారని విమర్శించారు. ఈ సాయంత్రం ఉప్పలవారిపాలెం చేరుకున్న చంద్రబాబు హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాబును చూడగానే ఆ కుటుంబం ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగానికి లోనై విలపించారు. పార్టీ తరఫున 10 లక్షల రూపాయల పరిహారాన్ని బాబు అందించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ తన అక్కను వేధిస్తుంటే అడ్డుకున్నందుకే అమర్నాథ్ గౌడ్ ను దుండగులు చంపివేశారని, ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు హత్యకు గురికావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు పోసి తగల బెట్టడం ఆ దుండగుల రాక్షస మనస్తత్వానికి నిదర్శనమన్నారు.
ఇంత ఘోర దుర్ఘటన జరిగితే ముఖ్యమంత్రి కనీసం పరామర్శకు రాకపోవడం శోచనీయమన్నారు. ఈ తరహా ఘటనలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని దురాగాతాలు జరిగే అవకాశం ఉందన్నారు. అధికార పార్టీ నేతలు లక్ష రూపాయలు చేతిలో పెట్టి ఒక ఆయా ఉద్యోగంతో సరిపెట్టుకోమని చెప్పడం మరింత బాధాకరమన్నారు. బాబు వెంట టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, టిడిపి బిసి సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర తదితరులు ఉన్నారు.