అధికారంలోకి వచ్చి 6౦ రోజులే అవుతుందని, గత ప్రభుత్వ అసమర్ధత, చేతగానితనం వల్ల వ్యవస్థలు కూలిపోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతు కుటుంబాలను బాబు పరామర్శించారు. గాయపడి కేజిహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ వైఎస్సార్సీపీ చేసిన వ్యాఖ్యలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇలానే మాట్లాడుతారని, ఇది శవాల దగ్గర పైసలు ఏరుకునే రకం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. జరిగిన సంఘటన ఏమిటి, మీ మాటలు ఏమిటి అంటూ ప్రశ్నించారు. వైసీపీ వ్యవస్థలను నాశనం చేసిందని… తాము వాటిని బాగుచేసే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నామని, దీనితో సరిపెట్టకుండా భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మనుషుల ప్రాణాలు ముఖ్యమని అందుకే ముందుగా ఫ్యాక్టరీకి వెళ్ళకుండా ఆస్పత్రికి వచ్చానని, సేఫ్టీ ఆడిట్ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో పరామర్శించాను. వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చాను. చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.