హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఫోటోలు తీయించుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు 10 కేజీలు మాత్రమే ఇచ్చారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుద్ హుద్లోగానీ, గత ఐదేళ్ళ పాలనలో తుఫాన్లు వచ్చినప్పుడు గానీ బాధితులకు చంద్రబాబు తక్షణ సాయంగా నగదు రూపంలో ఒక్క రూపాయి కూడా అందించాలేకపోయారని చెప్పారు. జీవో విడుదల చేయటం తప్ప బాబు చేసిన సాయం అంటూ ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అయితే హుద్ హుద్ పేరుతో భారీగా విరాళాలు వసూలు చేసిన చరిత్ర చంద్రబాబుదని, ఆ విరాళాలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు వెళ్ళాయా.. లేక బాధితులకు వెళ్ళాయా లేక నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్ళాయా? అని ప్రశ్నించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా జులైలో ఏకంగా 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, గ్రామాలుగానీ, ప్రజలుగానీ కొట్టుకుపోయే పరిస్థితి లేకుండా, లంక గ్రామాలు సహా, ప్రతి ఒక్కరినీ రక్షించుకున్నామని వివరించారు. ప్రాణ నష్టం లేకుండా చూసి, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజల్ని తక్షణం పునరావాస కేంద్రాలకు పంపించామని, అక్కడ ఆహారం సరఫరా చేశామని చెప్పారు.
తాము ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ-వార్డు వాలంటీర్ల వ్యవస్థలు బాగా ఉపయోగపడ్డాయి కాబట్టే ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంలో, ప్రజలను కాపాడటంలో, వారికి సహాయం అందించడంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టగలిగామన్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడిందని, అంతేకాకుండా, 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా మార్చడంతో, రెండు గోదావరి జిల్లాలు కాస్తా ఆరు జిల్లాలుగా మారాయనిని, ఇద్దరు కలెక్టర్లు ఆరుగురు కలెక్టర్లు అయ్యారని, ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లతో పరిపాలన వ్యవస్థ గతంలో ఎప్పుడూ చూడని విధంగా కష్టపడి పనిచేసిందని ప్రశంసించారు.
తాము డీబీటీ వర్సెస్ డీపీటీ అంటుంటే.. చంద్రబాబుకు ఏమీ అర్థం కావడం లేదని, కాబట్టే, వరద ప్రాంతాలకు వెళ్ళి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అమర్నాథ్ మండిపడ్డారు.
Also Read : బాబు సంస్కారానికి నా నమస్కారం : సిఎం