Sunday, January 19, 2025
HomeTrending Newsబాబు చరిత్రలో ఏమున్నది గర్వకారణం?: సిఎం జగన్

బాబు చరిత్రలో ఏమున్నది గర్వకారణం?: సిఎం జగన్

మొత్తం 175 ఎమ్మెల్యే, 25 ఎంపి సీట్లు గెల్చుకుంటామని, ఈసారి డబుల్ సెంచరీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు   ప్రజాకంటక పాలన సాగించి… ఇప్పుడు రావణుడు, దుర్యోధనుడు, నరకాసురుడు ఏకమై తాము సింహాసనం ఎక్కుతామంటే ప్రజలు ఒప్పుకోరని, అలాగే నారావారి పాలన మళ్ళీ తీసుకువస్తామంటే ఒప్పుకోబోమని చెప్పడానికి నంద్యాల నుంచి ఏలేరు వరకూ, కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

చంద్రబాబు గతంలో 14 ఏళ్ళపాటు….మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు … ఇప్పుడు తాము చేసిన మార్పుల్లో కనీసం 10 శాతం చేసి ఉన్నా కూడా బాబుకు పది రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, నాలుగు ఆస్కార్లు, పదహారు రామన్ మెగసెసే అవార్డులు అడిగి ఉండేవారని….. యునైటెడ్ నేషన్స్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్  ఇద్దరూ వచ్చి బాబుకు శాలువా కప్పాలంటూ ఆయనకు సంబంధించిన వారు అడిగి ఉండేవారని ఎద్దేవా చేశారు.  మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి ఏ గడ్డి అయినా తినడానికి సిద్ధంగా ఉన్నారంటూ బాబుపై ధ్వజమెత్తారు. ఇలాంటి అధ్వాన్నమైన పాలకుడు రాష్ట్రానికి కావాలా అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు.

బాబు చరిత్ర చూస్తె ఏమున్నది గర్వకారణం? బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం? బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం? అంటూ ప్రశ్నించారు. మరో ధర్మ-అధర్మ యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం వచ్చిందని… ఈ యుద్ధంలో ధర్మం వైపున నిలబడడానికి… విస్వసనీయత-వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధంలో… పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడడానికి మీరంతా సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్