Sunday, January 19, 2025
HomeTrending NewsChandrababu: సెంటు భూమి ఏ మూలకు?

Chandrababu: సెంటు భూమి ఏ మూలకు?

జగన్ మళ్ళీ గెలిస్తే విశాఖలోని పేదల భూములన్నీ మటాష్ అవుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి రాజధానిగా, విశాఖ ఆర్ధిక, ఐటి రాజధానిగా ఉంటుందని గతంలో తాను చెప్పానని, కానీ జగన్ మూడు రాజధానులు అన్నారని, ఇప్పుడు ఏపీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. జగన్ కు విశాఖపై ప్రేమ లేదని, ఇక్కడి భూములపైనే ప్రేమ అని ఎద్దేవా చేశారు. విశాఖను అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను శంఖుస్థాపన చేస్తే దాని పనులు కొనసాగించకుండా నాలుగేళ్ళపాటు కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళీ ఫౌండేషన్ వేశారని విమర్శించారు. భోగాపురం పూర్తి చేసేది కూడా తామేనని స్పష్టం చేశారు.

అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు అంటూ కొత్త నాటకానికి తెరతీశారని, వెయ్యి ఎకరాల్లో సెంటు భూమి దేనికి సరిపోతుందని బాబు ప్రశ్నించారు. ఆ సెంటు భూమి మనల్ని పూడ్చటానికి తప్ప దేనికీ పనికిరాదని దుయ్యబట్టారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఎత్తివేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు సంక్షేమానికి నాంది పలికిందే తమ పార్టీ అని గుర్తు చేశారు. తాను ఒక అద్దె ఇంట్లో ఉంటే అది కూడా కూల్చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూడాలన్నారు. అసలు రింగ్ రోడ్ లేదని, లేని దాన్ని చూపించి, తన ఇంటిని క్విడ్ ప్రో కో అంటూ నోటీసులు ఇచ్చి కోర్టులో కేసు వేసి ఇల్లు జప్తు చేస్తామని అంటున్నారని, జగన్ కు పిచ్చి ముదిరిందని బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడ్కో ద్వారా తాము 52 వేల ఇళ్ళు నిర్మించామని, 32 వేల మందికి ఇచ్చామని, కానీ మిగిలిన వాటిని లబ్ధిదారులకు అందించలేకపోయారని విమర్శలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్