వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపు- బాబుకు ఓటేస్తే ఆ పథకాలకు ముగింపు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేనిఫెస్టో అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదని ఆయనకు ఓటేస్తే వర్షాలు గోవిందా! పథకాలు గోవిందా గోవిందా!! అంటూ అభివర్ణించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బాబు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మితే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన మేమంతా సిద్ధం రోడ్ షో లో ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.
- చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు.. గోవిందా గోవింద
- చంద్రబాబు కుర్చీ ఎక్కితే వర్షాలు, రిజర్వాయర్లలో నీళ్లు, ఉద్యోగాలు.. గోవిందా గోవింద
- అన్ని హంగులు ఉన్న విశాఖను వదిలేశారు.. గ్రాఫిక్స్ రాజధాని గోవిందా గోవింద
- చంద్రబాబు వల్ల ప్రత్యేక ప్యాకేజీ గోవిందా..
- విభజన హామీలు గోవిందా.. అంటూ బాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు.
2014లో దొంగ హామీలతో బాబు మోసం చేశారని, రైతు రుణమాఫీ, మహిళా సంఘాల రుణాలు మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి లాంటి ఏ హామీనీ ఆయన అమలు చేయలేదని వివరించారు. బాబు గతంలో దోచుకొని, దాచుకున్న డబ్బులు చాలా వున్నాయని, ఓటుకు 2 వేల రూపాయలు ఇవ్వాలని చూస్తున్నారని ఆ డబ్బులు ఇస్తుంటే తీసుకొని ఓటు మాత్రం వైసీపీకే వేయాలన్నారు. ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుందో, ప్రస్తుతం జరుగుతున్న మంచి కొనసాగుతుందో ఆలోచించి కుటుంబంతో కలిసి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలన్నారు. లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారు.