చంద్రబాబు నాయుడు రాజకీయంగా దివాలా తీశారని, నిన్నటి ఘటన ఆయన రౌడీయిజానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు సంఘటన బాధాకరమని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ పోలీసులను చిత్తూరు ప్రధాన ఆసుపత్రి లో ఆయన పరామర్శించారు. పోలీసులు త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్నటి ఘటన బాబు ఆలోచలన ప్రకారమే జరిగిందని, ఆయన ఆదేశాలతోనే టిడిపి మూకలు ఈ దాడులకు పాల్పడ్డాయని స్పష్టం చేశారు. 200 వాహనాల్లో రౌడీలు వచ్చి పోలీసులు, వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ఒకరు షార్ట్ గన్ పెట్టుకున్నారని, మరొకడు పిస్టల్, ఇంకొకడు డబుల్ బ్యారెల్ గన్.. బుల్లెట్ల తో సహా పెట్టుకున్నారని వివరించారు.
చంద్రబాబు భాష కూడా సరిగా లేదని, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, నా కొడకల్లారా, చూస్తా మీ కథ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని పెద్దిరెడ్డి తప్పుబట్టారు. కుప్పంలో బాబు ఓడిపోతున్నారని, జిల్లాలో… రాష్ట్రంలో కూడా టిడిపి పరిస్థితి బాగా లేదని, అందుకే రౌడీయిజానికి, గూండాయిజానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు ఎంతో సంయమనం పాటించారని, వారు కూడా సహనం కోల్పోయిఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని అన్నారు. నిన్నటి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, ముద్దాయిలను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కాలేజీ రోజుల నుంచే తాను బాబుకు టార్గెట్ అని పేర్కొన్నారు.