ప్రాజెక్టుల యాత్ర పేరుతో బయలుదేరిన చంద్రబాబు, నిన్న దురుద్దేశంతో రూటు మార్చుకుని, పుంగనూరు వెళ్తానంటూ నిన్న బైపాస్ రోడ్ వద్ద విధ్వంసం సృష్టించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో, వారిపై పార్టీ కార్యకర్తలతో దాడి చేయించాడని, ప్రచార వాహనంపై నిల్చొని మైకు పట్టుకుని ఏకంగా పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఆ విధంగా పార్టీ కేడర్‌ను పోలీసులపైకి ఉసి గొల్పడం ఎంత వరకు సబబు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు?. రాష్ట్రంలో ఎవరైనా నిరసన చేయొచ్చు. కానీ విధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదన్న విషయం చంద్రబాబుకు తెలియదా?. అందుకే నిన్న పుంగనూరులో విధ్వంసానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబే” అంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ విపక్షనేతగా రాష్ట్రంలో మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఎక్కడా చిన్నపాటి ఘర్షణ తలెత్తలేదని, మా పార్టీ కార్యకర్తల్ని క్రమశిక్షణలో పెట్టుకుని, ఒక సంకల్పం కోసం తమ నేత యాత్ర చేశారని, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న యాత్రలు, పర్యటనలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో.. ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడ ఎలాంటి ఘోర ఘటనలు జరుగుతున్నాయో స్వయంగా ప్రజలే చూస్తున్నారని అన్నారు.
తాను పోలీసు కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే పవన్ కళ్యాణ్ నిన్న పుంగనూరులో అంతమంది పోలీసులు రక్తమోడుతూ దెబ్బలు తిని గాయాలతో కనిపిస్తే ఎందుకు స్పందించడని మంత్రి ప్రశ్నించారు. ‘పోలీసు వాహనాల్ని తిరగేసి తగల బెడితే.. నీ తండ్రి లాంటి వారైన పోలీసులకు తగిలిన దెబ్బలపై నువ్వెందుకు మాట్లాడడం లేదు? వాటి గురించే మాట్లాడని నీవు, నీ దత్తతండ్రి వైఖరిపై ఏం స్పందిస్తావ్?. నీ దత్తతండ్రి జడ్ క్యాటగిరి సెక్యూరిటీలో ఉన్నాడు. ఆయనపై ఒక రాయేసినా గార్డులు కాల్పులు జరిపే పరిస్థితి ఉంది కదా? అలాంటప్పుడు ఆయనపై దాడి ఎక్కడ జరిగింది. నిజానికి ఆయనే పోలీసులపై దాడికి ఉసి గొల్పాడు” అని మండిపడ్డారు.