Friday, November 22, 2024
HomeTrending Newsవైఎస్ స్పూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ

వైఎస్ స్పూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ

రాజీవ్ గాంధీ, వైఎస్సార్ లు సోదరుల్లా ఉండేవారని, వైఎస్సార్ పాదయాత్ర స్పూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర చేశానని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. పాదయాత్ర చేస్తే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవచ్చని తనకు వైఎస్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. పేదల కోసమే వైఎస్సార్ రాజకీయాలు చేశారని, ఆయనది ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమేనని, జీవితమంతా బిజెపి సిద్దాంతాలకు వ్యతిరేకంగానే ఆయన పోరాడారని కొనియాడారు. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ రాష్ట్రానికే కాకుండా దేశానికే మార్గదర్శిగా నిలిచారన్నారు. కడపలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పాలనలో కూడా వైఎస్ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారని, కానీ ఇప్పుడు వైఎస్ తరహా పాలన ఏపీలో కనిపించడంలేదని విమర్శించారు.

ఏపీ ప్రయోజనాల కోసం, పేదల కోసం వైఎస్ ఎంతగానో తపించారని, ఢిల్లీలో రాష్ట్ర హక్కుల కోసం పాటు పడ్డారని… కానీ ఇప్పుడు ఏపీలో బిజెపి బి టీమ్ మాత్రమే ఉందని ఆరోపించారు. బి అంటే బాబు; జె అంటే జగన్; పి అంటే పవన్ అని అభివర్ణించారు. ఈ ముగ్గురి రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ చేతిలోనే ఉందని ఎందుకంటే ఆయన చేతిలో ఈడీ, సిబిఐ లాంటి సంస్థలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళయినా ఆ చట్టంలో ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలు కాలేదని, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని తాము రాగానే… ఎపీకి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాహుల్ గాంధీ, కెవిపి రామచంద్రారావు, వైఎస్ షర్మిల, అనిల్ నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్