వ్యవస్థలో రాజకీయ పార్టీలు, నాయకులు శాశ్వతం కాదని, వారు చేసే మంచి పనులే శాశ్వతమని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మనం మంచి చేసినా, చెడు చేసినా దాని ప్రభావం ఉంటుందని, కానీ మంచి చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగం ఉంటుందని స్పష్టం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ రచించిన ‘అమరావతి: వివాదాలు – వాస్తవాలు’ అనే పుస్తకాన్ని విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు ఆవిష్కరించారు. బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నేత డా.ఎన్. తులసిరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో తాను చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు తన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయని, సైబెరాబాద్ పేరుతో ఓ సరికొత్త నగరాన్ని తయారు చేయగలిగామని గుర్తు చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటి అభివృద్ధి లాంటి ఎన్నో కార్యక్రమాలకు తాను శ్రీకారం చుడితే తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటిని పూర్తి చేశారని చెప్పారు. కొన్ని కార్యక్రమాలో తన పేరు ప్రస్తావించక పోయినా వాటికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా తనకు ఎంతో ఆత్మ సంతృప్తి ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్ కు భూములు ఉన్నాయని, కానీ ఇక్కడ విజయవాడ సమీపంలో అనువైన భూములు లేవని, అందుకే రైతుల భాగస్వామ్యంతో రాజధాని నిర్మించాలని తలపెట్టామన్నారు. అభివృద్దికి-ఎన్నికలకు సంబంధం లేదని, అమరావతి నిర్మాణం మొదలు పెడితే ఇక్కడ తాడికొండలో కూడా తమను ఓడించారని, హైదరాబాద్ ను ఎంతగానో అభివృద్ధి చేస్తే 2004లో ఖైరతాబాద్ లో కూడా టిడిపి ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. అమరావతి భూముల్లో పది వేల ఎకరాలుంటే తాము మొదలు పెట్టిన తరువాత ఎకరం పది కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చిందని, ఇంకా అభివృద్ధి చేసి ఉంటే ఎకరా 20, 30 కోట్ల వరకూ వెళ్లి ఉండేదని అంటే షుమారు రెండు, మూడు లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టి జరిగి ఉండేదన్నారు.
ఏపీ రాష్ట్రంలోని ఐదుకోట్ల ప్రజలూ ఆలోచించాలని, తాను హైదరాబాద్ ఒక కులం కోసం అభివృద్ధి చేయలేదని, తెలుగు జాతి కోసమేనన్నారు. హైదరాబాద్ లో ఐటి అభివృద్ధి కోసం 25 ఏళ్ళ క్రితం తాను వేసిన విత్తనాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అమరావతిని కూడా ఆ దిశలోనే అభివృద్ధి చేయాలని అనుకున్నానని బాబు వివరించారు. అమరావతి పరిరక్షణ కోసం ఇక్కడి రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని బాబు భరోసా ఇచ్చారు.
Also Read : ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు: బాబు