తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్ర శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు నిన్న ఏ విధంగా ఆ మేనిఫెస్టో విడుదల చేశారో చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలకు తోడు మరికొన్ని చేర్చి నిన్న విడుదల చేశారని విమర్శించారు. అసలు అమలు చేయాలనే ఉద్దేశంతో అది ప్రకటించినట్లు లేదని, కేవలం ప్రజలను మోసం చేసి ఓట్లు రాబట్టుకోవడానికే చెప్పినట్లు ఉందని వ్యాఖ్యానించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సభకు మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.
ప్రజలు ఒకసారి టిడిపి మేనిఫెస్టోను చదవాలని, చదవలేనివారికి వచ్చినవారు చదివి వినిపించాలని సూచించారు. మోసపూరిత వాగ్దానాలతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బాబు ప్రయతిస్తున్నారని ఆరోపించారు. కేవలం రెండు పేజీల మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మొదటి రోజు నుంచీ ఇప్పటి వరకూ 98.44 శాతం హామీలు నెరవెర్చారని, ఏ ఒక్కటీ మాట తప్పకుండా ప్రజల మన్ననలు పొందారని, కానీ చంద్రబాబు గత అబద్ధాలకు మరికొన్ని కలిపి ఎక్కువ అబద్ధాలతో వచ్చారని, ఈ హామీల అమలుతో రాష్ట్రం శ్రీలంక కాదా అని ప్రశ్నించారు. ఈరోజు నుంచీ టిడిపి కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తారని, ప్రతి ఇంటికీ, బిడ్డకూ డబ్బులు ఇస్తామంటూ ఊదర గొడతారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ హామీలతో మోసపోవద్దని సూచించారు.