ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఐవీఆర్ఎస్ ద్వారా పోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని ప్రజలకు చెబుతున్నారని.. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఈ జగన్ భూములిచ్చేవాడే కానీ, భూములు లాక్కునే వాడు కాదని, అసలు బాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అంటే తెలుసా? దాని అర్ధం ఏమిటో తెలుసా అంటూ ప్రశ్నించారు. భూములు మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఏళ్ళవేళలా ఉండేటట్టుగా చేయడమే ఈ యాక్టు లక్ష్యమని, మొదట అది తెలుసుకోవాలని హితవు పలికారు.
ఈ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుందని, ఇప్పుడు ఏ భూమి ఎక్కడ కొనాలన్నా వివాదాలు తలెత్తుతున్నాయని, ఎక్స్ టెంట్ అన్నా తక్కువ ఉంటుందని… సబ్ డివిజన్ జరగకపోవడమో, సర్వే జరగకపోవడమో, రికార్డులు అప్ డేట్ కాకపోవడమో చూస్తున్నామని, దీనివల్ల భూవివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు కోర్టులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నారని వివరించారు.
భవిష్యత్తులో ఏ ఒక్కరూ వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా, ఆ భూముల మీద వాళ్లకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ.. ఒక సంస్కరణ తీసుకురావాలన్నది తమ అభిమతమని చెప్పారు.
“భూముల మీద ఏదైనా వివాదం ఉంటే.. ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదం కూడా ఉండకుండా చూడడంతో పాటు, టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి, ఎటువంటి వివాదం కూడా లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే.. మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వే పూర్తి కావాలి” అని జగన్ అన్నారు.
“ప్రతి ఒక్కరి దగ్గరా వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది. సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి. రికార్డులన్నీ అప్ డేట్ అయిన భూములు ఉంటాయి. సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ పేదలు, ఆ రైతన్నల దగ్గర ఉంటాయి. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుని వచ్చి ఏ స్ధాయిలోకి తీసుకునిపోతామంటే.. ఆ భూములన్నింటికీ వివాదాలు ఏమన్నా వస్తే.. ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి, తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుతున్నాను. చంద్రబాబు చెప్పే అబద్దాలను, మోసాలను ఏ ఒక్కరూ నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ ప్రార్ధిస్తున్నాను” అంటూ విజ్ఞప్తి చేశారు.