ఈ సాయంత్రం పులివెందులలో పూల అంగళ్ళ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడికి సమీపంలోని వెంకటేశ్వర ఆలయం వద్దకు వేదిక మార్చుకోవాలని టిడిపి నేతలకు పోలీసులుసూచించారు.
అంతకుముందు గండికోట ప్రాజెక్టు వద్దకు వెళ్తూ జమ్మలమడుగులో ప్రజలనుద్దేశించి బాబు ప్రసంగించారు. ప్రజల చేతుల్లో ఓటు అనే ఆయుధం ఉందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం గురించి, పిల్లల గురించి అలోచించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జమ్మల మడుగులో భూపేష్ రెడ్డి దూసుకు పోతున్నారని, ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పది రోజులపాటు 2,500 కిలోమీటర్ల పాటు పర్యటించి సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సిఎం జగన్ కు దోచుకోవడంపై శ్రద్ధ ఉందికానీ, ప్రజల గురించి పట్టదని విమర్శించారు. నాలుగేళ్ళుగా రాయలసీమలో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయిన జగన్… మనకు సిఎంగా అవసరమా అని ప్రశ్నించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. దోపిడీ రాజ్యాన్ని అంతం చేసి పేదవారికి అండగా ఉంటానని, భరోసా ఇచ్చారు. మన ఇసుక బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైలో దొరుకుతుందని దుయ్యబట్టారు. మద్యం షాపుల్లో ఎందుకు బిల్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
కాగా చంద్రబాబు ప్రసంగిస్తుండగా సమీపంలోని టిఫిన్ బండికి కొందరు దుండగులు నిప్పు పెట్టినట్లు తెలిసింది. అక్కడ మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ‘అక్కడక్కడా కొంతమంది చిల్లర గాళ్ళు ఉంటార’ని బాబు వ్యాఖ్యానించారు.