లాండ్ టైటిలింగ్ యాక్ద్ విషయంలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. భూములు జగన్ కాజేస్తాడంటూ బాబు ఆరోపణలు చేస్తున్నారని కానీ ఈ జగన్ భూములు ఇచ్చావాడే కానీ బాబు లాగా లాక్కునేవాడు కాదని స్పష్టం చేశారు. జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలియకపోవచ్చని కానీ రాష్టంలో ఉన్న ప్రతి పేదవాడికీ తెలుసనీ వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగిస్తూ ఈ చట్టంపై ప్రజలకు వివరించారు.
భూ యజమానులకు వారి భూములపై సర్వ హక్కులూ కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఎప్పుడో బ్రిటిష్ వారు ఉన్న కాలంలో వందేళ్ళ క్రితం భూముల సర్వే జరిగిందని, దాని తర్వాత ఎక్కడా సర్వే చేయలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం చేస్తున్నట్లు 15 వేల సచివాలయాల్లో సర్వేయర్లను పెట్టి సర్వే చేయించే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు.
భూములు సబ్ డివిజన్ జరగక, కొలతలు సరిగ్గా లేక అమ్ముకునేందుకు, కొనేందుకు ఇబ్బందులు పడుతూ… ప్రజలు కోర్టుల చుట్టూ, రెవిన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ… లంచాలు ఇచ్చుకుంటూ అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చాలని, ప్రతి ఒక్కరికీ వారి భూములపై సంపూర్ణ హక్కులు ఇవ్వాలనే రీ సర్వే చేయిస్తున్నామని, భూముల చుట్టూ సరిహద్దు రాళ్ళు పాతి, రికార్డులు అప్ డేట్ చేసి, ఆ రికార్డులు మళ్ళీ రైతులకే ఇవ్వాలనదే ఈ చట్టం ముఖ్యం ఉద్దేశమని వివరించారు. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు ఇవ్వాలి కానీ, దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.