Sunday, January 19, 2025
HomeTrending Newsజగన్ హయంలో పల్నాడు అభివృద్ధికి జీవం: కాసు

జగన్ హయంలో పల్నాడు అభివృద్ధికి జీవం: కాసు

పల్నాడులో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. బ్రహ్మారెడ్డి ఇన్ ఛార్జ్ గా వచ్చిన తర్వాతే ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో పల్నాడు ప్రజలు బాబును ప్రశ్నించాలని కోరారు. ఇక్కడి ప్రజలు ఇదేం ఖర్మ- పల్నాడుకు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బాబు సిఎంగా ఉన్న1999-2004 మధ్య పల్నాడు పరిస్థితి ఏమిటో ఆలోచించాలని, నక్సలిజం తాండవించేదని, కరువు కాటకాలు…కనీసం పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని…ఫ్యాక్షనిజం ఉధృతంగా ఉండేదని గుర్తు చేశారు.

బ్రహ్మారెడ్డి తల్లి నాడు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఏడుగురి మర్డర్ కేసులో బ్రహ్మారెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారని మహేష్ రెడ్డి పేర్కొన్నారు. నాడు టిడిపి ప్రభుత్వం ఉన్నా ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక  ఆయన్ను అరెస్టు కూడా చేశారన్నారు. ఆ తర్వాత పిన్నెల్లి లక్ష్మా రెడ్డి, రామకృష్ణా రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారని.. వీరి హయాంలో ఇన్నేళ్ళుగా ఎలాంటి గొడవలూ లేవని అన్నారు. మళ్ళీ బ్రహ్మారెడ్డిని ఇక్కడ ఇన్ ఛార్జ్ గా ఎందుకు పెట్టారో చెప్పాలని, ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చు లేపదానికి కాదా అని బాబును సూటిగా ప్రశ్నించారు.

ఎన్టీఆర్ సమయం నుంచి పల్నాడులో ఉన్న వడియ రాజులు ఎక్కువ మంది టిడిపిలో ఉండేవారని, కానీ గత ఎన్నికల సమయంలో 60-70శాతం మంది వారు మా పార్టీకి, జగన్ కు అండగా  నిలిచారని మహేష్ రెడ్డి అన్నారు. వారికి జగన్ కూడా ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించారని, దీనిపై అక్కసుతోనే… వారిని వైసీపీ నుంచి దూరం చేసేందుకే దాడులు చేస్తున్నారని విమర్శించారు.

2009కు ముందు పల్నాడు బీహార్ లాగా ఉండేదని, వైఎస్ అధికారంలోకి వచ్చి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన తరువాత, నక్షలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని రూపు మాపిన తరువాత మళ్ళీ ప్రాణం పోసుకుందని… ఇప్పుడు సిఎం జగన్ వచ్చిన తరువాత జీవం పోసుకుందని మహేష్ రెడ్డి వివరించారు. జగన్ హయంలో పల్నాడు జిల్లా వచ్చిందని, మెడికల్ కాలేజ్ వచ్చిందని, వాటర్ గ్రిడ్ వచ్చిందని, మూడు హైవేలు వచ్చాయని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్