Saturday, January 18, 2025
HomeTrending NewsKodali Nani: టిడిపిలో ఇంకెవరూ లేరా? : నాని

Kodali Nani: టిడిపిలో ఇంకెవరూ లేరా? : నాని

చంద్రబాబు పెళ్ళయిన 42 ఏళ్ళ తరువాత నిమ్మకూరు అత్తగారి వూళ్ళో బస చేస్తే పడుకోడానికి ఒక్కరు కూడా ఇళ్ళు ఇవ్వలేదని, బస్సులో పడుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. నిన్న చంద్రబాబు నివాళులర్పించిన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు తాను, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఏర్పాటు చేశామని, అది మా ఆస్తి అని… జూనియర్ 40 లక్షలు, తాను 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామనిచెప్పారు. ఆంధ్రా వాలా ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేసి, పది లక్షల మంది సమక్షంలో ఆ విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన ఎనిమిదేళ్ళ వరకూ ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేయలేదని బాబును నిలదీశారు. హరికృష్ణ రాజ్య సభగా ఉన్నప్పుడు 14 కోట్ల రూపాయలు నిమ్మకూరు అభివృద్ధికి కేటాయించారని చెప్పారు. హరికృష్ణకు గ్రామస్తులంతా కలిసి సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్టీఆర్ ఇల్లు కూడా హరికృష్ణ కట్టించిందేనన్నారు. వారి వారసులంతా స్థలాలు, పొలాలు అమ్ముకుని వెళ్తే…. జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పాతిక ఎకరాలు కొనుక్కున్నారని, అయన ఏర్పాటు చేసిన విగ్రహాలు ఉన్నాయని తెలిపారు.

బాబు సిఎంగా ఉన్నప్పుడు గుడివాడలో పేదలకు ఇళ్ళ కోసం యక్క ఎకరా స్థలం కొని ఉంటే తానూ రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ విసిరారు.  చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో టిడిపి ఎంపిలు కేంద్రంతో సఖ్యతగా ఉన్నారని, అప్పుడు గుడివాడకు ఎందుకు ఫ్లై ఓవర్లు తీసుకు రాలేదని ప్రశ్నించారు.  నిన్న గుడివాడలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నాని తీవ్రంగా స్పందించారు.  గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని నాని ప్రకటించారు. ఖాళీ  కుర్చీలకు గంటన్నర పాటు మీటింగ్ చెప్పిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు.

ఎంపి బాల శౌరి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి గుడివాడలో 320 కోట్ల రూపాయలతో రెండు రైల్వే గేట్లకు ఫ్లై ఓవర్లు మంజూరు చేయించారని, భూ సేకరణకు 40 కోట్లు ఇచ్చామని, పనులు కూడా మొదలయ్యాయని వెల్లడించారు. 150 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు వేశామని, మొత్తం 600 కోట్ల రూపాయల ఖర్చుతో400 ఎకరాల స్థలం కొనుగోలు చేసి 23 వేల మందికి  ఇళ్ళు కట్టించి ఇస్తున్నామని…. మంచినీటి సరఫరా కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.

నిన్న బాబు గుడివాడ వస్తే వాహనంపై నలుగురు నిల్చుంటే నలుగురూ కమ్మవారే ఉన్నారని, అంటే గుడివాడలో వేరే కులాల వారు ఎవరూ లేరా, నీ పార్టీలో అచ్చెన్నాయుడు, కొనకళ్ళ నారాయణ లేరా, వాళ్ళను ఎందుకు పక్కన పెట్టుకోలేదు అని ప్రశ్నించారు. అదేమైనా కమ్మ సంఘం మీటింగా అంటూ కొడాలి  నిలదీశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్