మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని, సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా చంద్రబాబు కూడా పర్యటనలు చేశారని, మైక్ తీసుకుని ప్రభుత్వంపై బురద చల్లేలా ఆరోపణలు చేశారు కానీ ప్రభుత్వం ఎక్కడ, ఏవిధంగా విఫలమైందో స్పష్టంగా చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
స్వర్ణముఖి బ్యారేజ్, బాలిరెడ్డి గ్రామస్తులతో సీఎం జగన్ ముఖాముఖి మాట్లాడారని, బాపట్లలోనూ పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం పర్యటించిన రోజునే చంద్రబాబు కూడా వెళ్ళారని, కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపలేకపోయారని అన్నారు. దానికి కారణం తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతునూ ఆదుకున్నామన్నారు. విపత్తు సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉండాలి కానీ, సాయం చేయకుండా కేవలం ప్రెస్‌మీట్లకు మాత్రమే చంద్రబాబు, టీడీపీ నాయకులు పరిమితం అయ్యారని మంత్రి విమర్శించారు.
విపత్తుల సమయంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలిచిందని, ఈ క్రమంలోనే రైతులకు చేసిన మేలుపై, వారికి అందిన లబ్ధిపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని… ఏ మాత్రం నిజాయతీ ఉన్నా ఎవరెవరు రైతులకు ఎంత మేలు చేశారో బహిరంగ చర్చకు రావాలని కాకాణి ఛాలెంజ్ చేశారు. తేదీ, సమయం, స్థలం, చంద్రబాబు ప్రకటిస్తే.. తాను చర్చకు సిద్ధమన్నారు.
నిజానికి, విపత్తుల సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటని కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారని, రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు యాక్షన్ మరొకరు డైరెక్షన్ చేస్తున్నారన్నారు, గతంలో రైతులను చంద్రబాబు అవమానకరంగా మాట్లాడి వ్యవసాయం దండగ అన్నారని గుర్తు చేశారు. గతంలో తాను పరిహారం ఎక్కువగా ఇచ్చానంటూ బాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని మంత్రి కాకాణి మండిపడ్డారు.