Saturday, January 18, 2025
HomeTrending NewsVoters List: అది బాబుకే తెలిసిన విద్య : సజ్జల

Voters List: అది బాబుకే తెలిసిన విద్య : సజ్జల

ఓటర్ల జాబితా అవకతవకలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు  దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ‘తామెప్పుడూ తప్పులు చేయని పార్టీ అంటూ ఈరోజు టీడీపీ  పతివ్రత కబుర్లు చెబితే మాత్రం చెల్లుబాటవుతుందా?’ అని ప్రశ్నించారు.  తెలుగుదేశం పార్టీ తప్పుడు పనులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, అధికారంలో ఉండగా ఆధారాలతో సహా దొంగ ఓట్లతో దొరికిన సంగతి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. నాడు దానిపై తాము ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి వాటిని నిలుపుదల చేయించామని, లేకపోయి ఉంటే ఫలితం ఏమి ఉండేదో అన్న ఆందోళన ఇప్పుడు తమకు కలుగుతోందని అన్నారు.  తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల  మీడియాతో మాట్లాడారు.

సిఎం జగన్‌ ఓటర్ల జాబితాలకు డబుల్‌ ఓటర్లు, ఫేక్‌ ఓటర్లపై ఆరా తీయిస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల ఓట్లు ఉన్నట్లు తేలిందని, వీటిపై మరో మారు క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవాల్ని నిగ్గుతేల్చాలని ఆదేశించారని సజ్జల వెల్లడించారు. ప్రజల ఆదరణ పొందుతున్న ప్రభుత్వానికి ఇలాంటి దొంగ ఓట్లు ఆటంకం కలిగించరాదని, ప్రజాప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలిగించే తప్పుడు ఓటర్లపై ఒక నిర్ణయానికి రావాలని మేము పూనుకున్నామన్నారు.

“చంద్రబాబు మాదిరిగా తప్పుడు విధానాలతో దొంగ ఓటర్లను ప్రయివేటు ఓటుబ్యాంకుగా డిపాజిట్‌ చేసుకోవాలనే ఆలోచన మాకు లేదు. వ్యవస్థల్ని ప్రలోభాలకు గురిచేయడం, ఓటర్లను మభ్యపెట్టడం, దొంగ ఓటర్లతో అధికారానికి అడ్డదారులేసుకోవడం అనేది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. ఆయనకు చెడుపనులు అడ్డగోలుగా చేసేందుకు, దారులు వెతకడంలో పీహెచ్‌డీ కూడా ప్రధానం చేయవచ్చు” అంటూ సజ్జల ఎద్దేవా చేశారు.

ఉరవకొండ జాబితా విషయంలో జరిగింది కేవలం ప్రొసీజర్ తప్పిదాలేనని సజ్జల అభిప్రాయపడ్డారు. “ఉరవకొండలో జెడ్పీ సీఈవోగా స్వరూపారాణి అనే మహిళా అధికారి 06.07.2017 నుంచి 30.04.2021 వరకు పనిచేశారు. అంటే, ఆమె టీడీపీ హయాం నుంచి పనిచేశారన్నమాట. ఆమె పనిచేసిన కాలంలో 4,081 ఓట్లు డిలీట్‌ అయ్యాయి. ఆ తర్వాత భాస్కర్‌రెడ్డి అనే అధికారి 24.06.2021 నుంచి 20-08-2023 వరకు పనిచేసి సస్పెండ్‌ అయ్యారు. ఆయన హయాంలో 2077 ఓట్లు డిలీట్‌ అయ్యాయి. అంటే మొత్తం 6,158 ఓట్లు తొలగించబడ్డాయి. వీటిల్లో 2,912 ఓట్లు ప్రొసీజర్‌ ప్రకారం తొలగింపు జరగలేదని ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం పెట్టి వారిని సస్పెండ్‌ చేయడం జరిగింది. అయితే, ఆ ఓట్లు తొలగింపు అనేది తప్పని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు పచ్చమీడియాలో కూడా తాటికాయంత అక్షరాలతో ప్రచురించుకున్నారు. ప్రొసీజర్‌ అమలులో లోపాలు మినహా అందులో ఎక్కడా రాజకీయ జోక్యం కనిపించలేదు. ఓట్ల తొలగింపునకు కారణాలేమైనప్పటికీ, సరైన ప్రొసీజర్‌ ప్రకారం నడుచుకోని అధికారులపై చర్యలు తీసుకోవడం ఎన్నికల సంఘం బాధ్యత. మరి, దీనికెందుకు టీడీపీ నేతలు, చంద్రబాబు, పచ్చమీడియా గగ్గోలు పెడుతుందో ఎవరికీ అర్ధంకావట్లేదు” అంటూ సజ్జల టిడిపిపై విమర్శలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్