Babu at Badudu: ఉచిత విద్యుత్ కు మంగళం పాడటానికే రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పక్క రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నా ఇక్కడ మాత్రం అమలు చేస్తున్నారని అయన విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం వేశారన్నారు. తమ హయాంలో విద్యుత్ సంస్కరణలు తెస్తే వాటిని అమలు చేయకుండా, ఏదో జరిగిందని రాద్దాంతం చేసి వాటిని రద్దు చేశారని, ఇప్పుడు విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లవలసలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సభకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఒక్క అవకాశం ఇవ్వాలంటూ నాడు జగన్ అనగానే ప్రజలంతా అయన మాయలో పడ్డారని, 151 సీట్లు రాగానే జగన్ కు అహంకారం పెరిగిందని వ్యాఖ్యానించారు. తాము ఫైబర్ నెట్ 149 రూపాయలకే ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని రూ. 290కి పెంచిందని, అన్ని పెంచుకుంటూ పోతున్నారని, అందుకే తాము బాడుడే బాదుడు పేరుతో కార్యక్రమం చేపతామని వివరించారు.
తాము ప్రైవేటు రంగంలో ఐదున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశ్రామిక వేత్తలు భయపడి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మూడేళ్ళలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రం డ్రగ్స్ కు చిరునామా మారిందని, అక్రమ మద్యం, గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరిగుతోందని.. రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో బాబు వెంట టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక దళిత వాడలో సహపంక్తి భోజనం చేశారు.
Also Read : లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది: బాబు లేఖ