Saturday, January 18, 2025
HomeTrending Newsజగన్ పాలనతో యువత జీవితాలు రివర్స్: చంద్రబాబు

జగన్ పాలనతో యువత జీవితాలు రివర్స్: చంద్రబాబు

ఎందరో గొప్ప నేతలు పుట్టిన గడ్డ కృష్ణాజిల్లా అని… ఇలాంటి గడ్డపై ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయని… అధికారం అంటే బూతులుగా మార్చారని, బూతులు తిట్టిన వారికే పదవులు ప్రమోషన్లు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.’ రౌడీయిజాన్ని తరిమి కొట్టండి అభివృద్ధికి పట్టం కట్టండి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కృష్ణాజిల్లా పామర్రు లో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ ప్రాంతంలోనే పుట్టి తెలుగు జాతికే గర్వకారణమైన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. సామాన్యులను అసామాన్యులుగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే మొత్తం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ఉండేదని…కానీ మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తీవ్రంగా విమర్శించారు. అసలు మూడు రాజధానులంటూ మాట్లాడటానికి సిగ్గు ఎగ్గు ఉందా అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.

2019లో కూడా తాను గెలిచి ఉంటే అమరావతి దేశంలో నెంబర్ వన్ గా అభివృద్ధి చెంది ఉండేదని… మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చేవని… కానీ దుర్మార్గపు పాలనతో జగన్ విధ్వంసం చేశాడని మండిపడ్డారు. సీఎం జగన్ రివర్స్ పాలనతో యువకుల జీవితాలను కూడా రివర్స్ చేశారని..వారిని గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా మారచారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ అధికారంలోకి రాగానే 3వేల రూపాయల నిరుద్యోగ భృతి అందజేస్తామని… ఉద్యోగం వచ్చేవరకు ఒక అన్నగా కుటుంబ పెద్దగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  మెగా డీఎస్సీ నిర్వహిస్తామని,  ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. పేదలు లేని సమాజాన్ని చూడాలని ఉంది తన లక్ష్యమని అందుకే నిరుపేదలను అభివృద్ధి చేసే బాధ్యత కూటమిదేనని చంద్రబాబు స్పష్టం చేశారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్