Saturday, November 23, 2024
HomeTrending Newsఅరాచక పాలన ఎదుర్కొంటాం: బాబు

అరాచక పాలన ఎదుర్కొంటాం: బాబు

We face them: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, వారి పాలనపై ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ప్రతిపక్ష నేత  చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. మీరు మారకపోతే మిమ్మల్ని మార్చే శక్తి ప్రజలకు ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37మంది టిడిపి కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారని, ఒక్క మాచర్లలోనే ఐదు హత్యలు జరిగాయని, వీరిలో నలుగురు యాదవ సామాజిక వర్గానికి చెందినవారని, 60మంది టిడిపి నేతలపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. ‘మూడేళ్ళ పాలనలో భీభత్సాలు’ పేరిట ఓ పుస్తకాన్ని మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు విడుదల చేశారు.  ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. పార్టీ నేతలతో కలిసి ఎగ్జిబిషన్ తిలకించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై చంద్రబాబు దుమ్మెత్తి పోశారు. ఓ వైసీపీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే దాన్ని కప్పిపుచ్చడానికి అమలాపురం అల్లర్లు సృష్టించారని బాబు ఆరోపించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని,  అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని, డిజిపి  ఏం చేస్తున్నాడని  నిలదీశారు. కొత్త డిజిపి వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని, ఇంకా దయనీయమైన పరిస్థితులు ఎక్కువయ్యాయన్నారు.  తమ పార్టీ నేతలను వేధించే పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కొన్ని ప్రత్యేక కేసులు విచారించాల్సిన సీబీసిఐడి 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడానికి, నేతలను వేధించడానికి ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు.  పోలీసులు పెడుతున్న కేసులు విచిత్రంగా ఉంటున్నాయని,  ఎస్సీలపైనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఆశ్చర్యకరమన్నారు. పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులపై ప్రజలను చైతన్యం చేస్తామని, న్యాయ పోరాటం చేస్తామని, వదిలి పెట్టబోమన్నారు.

తాము అన్నా క్యాంటిన్లు ప్రవేశపెట్టామని దాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇప్పుడు కొంతమంది స్వచ్చందంగా ముందుకు వచ్చి మళ్ళీ క్యాంటిన్లు ఏర్పాటు చేస్తుంటే వాటిని ద్వంసం చేయడం  పట్ల బాబు ఆవేదన వ్యక్తం చేశారు.  పదో తరగతి పరీక్షల్లో రెండు లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని, ఈ ప్రభుత్వం చెబుతున్న ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు, అమ్మ ఒడి ఏమయ్యాయని బాబు ప్రశ్నించారు.

Also Read : ప్రజల కోసమే మా పోరాటం: బాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్