మహానాడులో రెండ్రోజులపాటు చర్చల అనంతరం వచ్చే ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలు మెచ్చేదిగా, రాష్ర భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండేలా అదిరిపోయే సంక్షేమం, అభివృద్ధి చేసేలా ప్రణాళిక ఉంటుందని స్పష్టం చేశారు. రాజమండ్రిలో రెండ్రోజులపాటు జరిగే మహానాడు నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు అధ్యక్షోపన్యాసం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని బాబు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం అని, దీనిలో వైసీపీ కౌరవులను ఓడించేందుకు సిద్ధం కావాలని, టిడిపి కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపు ఇచ్చారు.
అందరం సమిష్టిగా పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగేళ్ల పాటు పార్టీ కార్యకర్తలు ఉక్కు సంకల్పంతో పని చేశారని, ప్రాణం తీస్తామని బెదిరించినా వెనకడుగు వేయలేదని అంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ప్రాణ సమానులైన పార్టీ కుటుంబ సభ్యులకు వందనం’ అని బాబు వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఇంతవరకూ చూడని ఉత్సాహం, అభిమానం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని, అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు.
తెలుగు దేశం పార్టీకి సంపద సృష్టించడం, సంక్షేమం అందించడం కొత్త కాదని… నష్టపోయిన ఏపీ రాష్ట్రాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో గట్టెక్కించడాదానికి సంకల్పం తీసుకుందామని.. దానికి రాజమండ్రి మహానాడు వేదిక కావాలని ప్రతిపాదించారు. ఆర్ధిక సంస్కరణలు వచ్చినప్పుడు పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) మోడల్ ఉండేదని.. సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోందని… అందుకే రాబోయే రోజుల్లో పిపిపిపి (ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ పార్టనర్ షిప్) తో ప్రతి పేదవాడినీ ధనికుడిని చేసే బాధ్యత తీసుకుందామని సూచించారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సిఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వేల నోట్ల రూపాయలు ఎక్కడా కనిపించలేదని, అందుకే దాన్ని రద్దు చేయాలని తాము కోరామని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం 2 వేల నోటు రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకు రావాలని స్పష్టం చేశారు.
బాబు ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు
- రావణాసురుడు సీతను అపహరించడానికి మారు వేషంలో వస్తాడు. అలాగే జగన్ రెడ్డి ప్రజలను సర్వనాశనం చేయడానికి వచ్చాడు.
- తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించిన పనుల వలన దేశానికే నెంబర్1 రాష్ట్రంగా వచ్చింది.
- ఏపీలో విధ్వంసకర పాలన వలన చివర స్థానంలో ఉంటున్నాం.
- మళ్లీ ఈ రాష్ట్రాన్ని గట్టెంక్కించే విధంగా కార్యక్రమాలు రూపొందించేలా ప్రణాళికలు రచిస్తున్నాం.
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిధ్ధంగా ఉంది. రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.
- పేదల వాళ్లకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి ఎలా చేయాలో చర్చిద్దాం.
- తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క పేదవాడికి అనుసంధానం కావాలి.
- బాదుడే బాదుడు, ఇదేం ఖర్మం, యువగళం కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేశారు.
- కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఇంటికి పంపి అసెంబ్లీని మళ్లీ గౌరవ సభగా మారుస్తాం.
- ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో పలకాలి.