ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. కానీ గత ప్రభుత్వం ఈ రెంటినీ విధ్వంసం చేసిందని విమర్శించారు. పోలవరాన్ని వైసీపీ గోదావరిలో కలిపిందని, రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన పోలవరం శాపంగా మారిందని, ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ మూర్ఖంగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. తొలుత ఉండవల్లిలో గత ప్రభుత్వం కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం రాజధానికి శంఖుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లి అక్కడి శిలాఫలకానికి ప్రణమిల్లారు. ఆ తర్వాత… ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, జడ్జిల కోసం నిర్మాణం మొదలు పెట్టి మధ్యలో నిలిచిపోయిన భవనాలను, ఐకానిక్ టవర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఐదు కోట్ల ప్రజానీకానికి దశ, దిశా నిర్దేశించే రాజధాని అమరావతి అని… తాము మొదలు పెట్టిన భవనాలు 80 శాతం పూర్తయినా వాటిని కొనసాగించకుండా మూలన పడేశారని, ఈ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసి, రాజధానిపై విషప్రచారం చేసి, అమరావతి నమూనాను విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. అమరావతి కోసం ఇక్కడి రైతులు, ముఖ్యంగా మహిళలు 1631 రోజులపాటు సుదీర్ఘ పోరాటం చేశారని, తాము విజయం సాధించిన తరువాత వారి దీక్ష విరమించారని… రాజధాని కోసం గతంలో వారు చేసిన త్యాగం, నేటి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. పోలవరం, అమరావతి ఎవరి వ్యక్తిగత సంపద కాదన్నారు.
అమరావతి రాజధానిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మొదటగా ఈ ప్రాంతంలో భవనాల మధ్య మొలచిన తుమ్మ చెట్లను తొలగించడం కోసం కాంట్రాక్టు పిలవాలని… ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలు, మీడియా, మేధావులు కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.