బద్వేల్ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని, ఉపఎన్నిక ఏకగ్రీవం కాకపోతే ఎవరు పోటీలోఉన్నా పార్టీపరంగా ప్రతిష్టాత్మకంగానే భావించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రతి గడపా తొక్కి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలన్నారు. ఏకపక్షంగా, ఓటన్నీ గంపగుత్తగా వైఎస్సార్సీపీకే పడేట్లుగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉపఎన్నికపై నియోజకవర్గ బూత్ స్థాయి కనీనర్ల విస్తృత స్థాయి సమావేశం బద్వేల్ లో జరిగింది. ఈ సమావేశానికి సజ్జలతో పాటు, డిప్యూటీ సిఎం అంజాద్ భాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ అభ్యర్ధి డా. దాసరి సుధ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఏకగ్రీవం అయితే సరేనని లేకపోతే ప్రతి ఇంటికీ వెళ్లి వైఎస్సార్సీపీకి ఎందుకు ఓటు వేయాలో వివరించాలని, డా. సుధమ్మ ఎన్నిక ఏకపక్షంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు వచ్చే ప్రతి ఎన్నికా రిహార్సల్ లాంటిదేనని అభిప్రాయపడ్డారు.
సిఎం జగన్ పై బురద జల్లడమే తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అజెండా అని కడప జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, అందుకే ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోందని, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలే దీనికి తార్కాణమని మంత్రి వెల్లడించారు. బద్వేల్ వైఎస్సార్సీపీ కి కంచు కోట అని, డా. సుధకు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీ దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి సురేష్ పిలుపు ఇచ్చారు.