నట సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ పై భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను ‘అఖండ’గా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తెలుగు చిత్రసీమలోనే మొదటిసారిగా ఓ టీజర్ ఈ స్థాయిలో వ్యూస్ సాధించింది. 50 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఇంకా సోషల్ మీడియలో దూసుకెళ్తోంది.
నేడు (జూలై 12) హైదరాబాద్‌లో ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. దీనితో అఖండ షూటింగ్ పూర్తి కానుంది. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ నుంచి అఖండ గెటప్ లో ఉన్న బాలకృష్ణకు దర్శకుడు బోయపాటి శ్రీను సీన్ వివరిస్తున్న ఓ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.