మైత్రీ మూవీ మేకర్స్ లో తాను గానీ, తన వియ్యంకుడు గానీ పెట్టుబడులు పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. జనసేన నాయకుడు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గతంలో ఇలాగే తన వియ్యంకుడు విశాఖలో 25 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించాడంటూ మూర్తి దుష్ర్పచారం చేశారని, ఒక్క సెంటు భూమి ఆక్రమించినట్లు చూపించాలని సవాల్ చేస్తే స్పందన లేదని బాలినేని మండిపడ్డారు.
తాజాగా మైత్రీ సంస్థలో తమ పెట్టుబడులు ఉన్నాయంటూ, వైఎస్ భారతీ రెడ్డి తన ద్వారా పెట్టుబడులు పెట్టారంటూ మూర్తి ఆరోపణలు చేయడం దారుణమని, సినీ పరిశ్రమతో సంబంధం ఉంది కాబట్టి నేరుగా పవన్ కళ్యాణ్ దీన్ని రుజువు చేయాలని బాలినేని డిమాండ్ చేశారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం ఉన్నా తానూ రాజకీయాలు మానేస్తానని, ఆస్తులన్నీ రాసిస్తానని, తప్పయితే సదరు నేతపై చర్య తీసుకుంటారా అని ప్రశ్నించారు. పదే పదే అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన గురించి దిల్ రాజును గానీ, హాసిని క్రియేషన్స్ చినబాబును గానీ అడిగి తెలుసుకోవాలని బాలినేని సూచించారు.