రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయని రాష్ట్ర విద్యుత్, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గంలోకి 100 శాతం కొత్తవారిని తీసుకుంటారని సూత్రప్రాయంగా తెలియారు. మంత్రివర్గంలో మార్పులపై సిఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తన మంత్రి పదవి పోయినా భయపడనని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తానని, ఇదే విషయాన్ని సిఎం జగన్ కు కూడా చెప్పానని బాలినేని వివరించారు. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే రెండున్నరేళ్ళ తరువాత 80 శాతం మందిని మారుస్తానని జగన్ చెప్పారని బాలినేని గుర్తు చేశారు.
కాగా, ప్రకాశం జిల్లాలో జడ్పీ చైర్మన్ విషయంలో నెలకొన్న విభేదాలపై బాలినేని స్పందించారు. వ్యక్తులు నచ్చకపోయినా పార్టీకోసం పనిచేయాలని, ఈ విషయాన్ని ఎప్పుడో తనకు మహా నేత వైఎస్సార్ చెప్పారని బాలినేని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి కలిసికట్టుగా ముందుకెళ్లాలని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దర్శి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు విడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉందని, ఏవైనా జటిలమైన సమస్యలుంటే తన వద్దకు రావాలని బాలినేని సూచించారు.