Saturday, November 23, 2024
HomeTrending Newsహైకోర్టుకు చేరిన పాదయాత్ర పంచాయితీ

హైకోర్టుకు చేరిన పాదయాత్ర పంచాయితీ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతుంది. బండి సంజయ్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. కేసీఆర్‌ నియంత పాలనకు ఇదే నిదర్శనమని బండి సంజయ్ విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. పాదయాత్రకు తొలుత అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ పోలీసులు కావాలనే పాదయాత్రకు అనుమతి నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొంది. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చి.. ఇప్పుడు కావాలనే రద్దు చేసినట్టుగా ఆరోపించింది. అయితే కోర్టు అనుమతి ఇస్తేనే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేడు భైంసాలో ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే పాదయాత్రను ప్రారంభించేందుకు నిర్మల్‌కు వెళుతుండగా ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా వెంకటాపూర్ పోలీసులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. పాదయాత్రకు, సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నట్టుగా చెప్పారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్