రోజక్క రొయ్యల దావత్ లో మతలబు ఏమిటో సిఎం కేసియార్ వెల్లడించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 2019 ఆగస్టు 12న వైఎస్సార్ సిపి నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని మాట ఇయ్యలేదా? అంటూ నిలదీశారు. అదే సమయంలో ఏపి ముఖ్యమంత్రితో ఏదో రహస్య ఒప్పందం కుదుర్చుకుని ఉంటారని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు విస్తరణకు వాళ్లింట్లోనే అగ్రిమెంట్ చేసుకున్నారా అని ప్రశ్నించారు. జగన్ కు 2019 ఎన్నికల ఖర్చు కోసం కేసియార్ 600 కోట్ల రూపాయల మేరకు ఓ కాంట్రాక్టర్ ద్వారా ఆర్ధిక సాయం చేశారని బండి ఆరోపించారు.
నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదం ప్రాతిపదికగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని, అలాంటి నినాదంలో తొలి నినాదం నీళ్లను ఆంధ్రాకు అమ్మేసి తెలంగాణ నోట్లో మట్టికొట్టిన కేసియార్ తెలంగాణకు నెంబర్ వన్ ద్రోహి అని మండిపడ్డారు. మొదటి అపెక్స్ కమిటీలోనే ఆంధ్రాకు 512 టీఎంసీలిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుని ద్రోహం చేశారు. ఏ సోయితో 299 టీఎంసీలకు ఒప్పుకున్నారంటూ కెసియార్ ను బండి సూటిగా అడిగారు. కృష్ణా నదీ జలాల వాటా విషయంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు డ్రామాలాడుతూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని ధ్వజమెత్తారు. నీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టడానికి 6 ఏళ్ళ క్రితమే పునాది పడిందని గుర్తు చేశారు. 2014-15 మధ్య కాలంలో 3 సార్లు సమావేశమై తెలంగాణాకు 299 టీఎంసీల నీటికి ఒప్పుకున్నారని చెబుతూ దానికి సంబంధించిన ఆధారాలు బైట పెట్టారు సంజయ్.
2019లోనే నీటి వాటాలు, ఏపీలో అక్రమ ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్, జగన్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు జరిగాయని సంజయ్ అన్నారు. పోలవరం సహా ఏపీలోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నింట్లో కమీషన్లు ఎలా దండుకోవచ్చో కేసీఆరే జగన్ కు సలహా ఇచ్చారని వివరించారు. అధికారంలోకి రాగానే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నరని బండి వెల్లడించారు.
హుజురాబాద్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునేలా కొత్త డ్రామాలకు కేసీఆర్ తెరలేపబోతున్నాడని బండి అనుమానం వ్యక్తం చేశారు. తాము చేసిన ఆరోపణలపై కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మేం చెప్పినవన్నీ వాస్తవాలని నిరూపిస్తాం. తప్పయితే ముక్కు నేలకు రాయడమే కాదు శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లలో దూకి చావడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. లేకపోతె కేసీఆర్ ప్రజలకు తప్పయిందని ఒప్పుకుని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. హుజురాబాద్ లో ఓడిపోతామనే కేసీఆర్ ఈ డ్రామాలడుతున్నాడని వ్యాఖ్యానించారు ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.