OTS : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం సంతోషకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓటిఎస్ ద్వారా జరుగుతున్న మంచికి ఇది చక్కటి ఉదాహరణ అని అయన అభివర్ణించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్‌డ్యూటీలను పూర్తిగా మినహాయించడం వల్ల ఇప్పటికే ఒక్కో లబ్ధిదారుడికి 15వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి మేలు కలిగిందన్నారు. సంపూర్ణ హక్కులు పొందిన లబ్దిదారులకు ఆ ఇంటిపై బ్యాంకులు ఉత్సాహంగా ముందుకు వచ్చి రుణాలివ్వడం ముదావహమన్నారు.
ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిల్స్ పొందిన వారికి సిఎం జగన్ ఆదేశాల మేరకు బ్యాంకర్లు రుణాలు ఇస్తున్నాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిఎం చేతులమీదుగా గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన లబ్ధిదారులు రుణాల చెక్కులు అందుకున్నారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వీరికి రుణాలు మంజూరుచేసింది. కనిష్టంగా రూ.1.5లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఓటీఎస్ లబ్ధిదారులకు ఈ బ్యాంకు రుణాలు ఇస్తోంది.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ “పేదవాడి జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. వారి కాళ్లమీద వాళ్లు నిలబడడానికి ఇవి దోహదం చేస్తాయి. వారి జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయి. నిర్ణీత కాలంలోగా ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు.
“గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన లబ్ధిదారులు కేవలం రూ.20వేలు ఓటీఎస్ కింద చెల్లించి క్లియర్ టైటిల్స్ పొందారు. ఎలాంటి న్యాయవివాదాలు లేకుండా వారి చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి. ఈ ఆస్తిని మళ్లీ బ్యాంకుల్లో తనఖాపెట్టి… రూ.3లక్షలు చొప్పున రుణం పొందారు. వారి కుటుంబాలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది” అని సిఎం విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సూచనల మేరకు లబ్ధిదారులకు రుణాలు అందిస్తామని బ్యాంకర్లు వెల్లడించారు.