దేశంలో బిసి జనాభాను ప్రభుత్వాలు తేల్చాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉండాలని, చట్ట సభల్లో ఉంటేనే నిధులు, విధుల కోసం పోరాటం చేసే ఆస్కారం ఉంటుందని అన్నారు. టిడిపి ఆధ్వర్యంలో గుంటూరు ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ హాల్ లో జోనల్ -3 బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో జాతీయ, రాష్ట్ర బీసీ ప్రతినిధులతో పాటు టిడిపి బిసి సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టిడిపి నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ బిసిలు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరని, కులాల వారీగా విడిపోతే ఏమీ పొందలేమని స్పష్టం చేశారు. బిసిలంటే వెనకబడిన వర్గాల వాళ్ళం కాదని, వెనకబడిన ముద్ర వేసుకొని మరింత వెనకబదోద్దని హితవు చెప్పారు.
ఎన్టీఆర్ వచ్చాకే బిసిలకు ప్రాధాన్యత వచ్చిందని. ఎందరో బీసీలకు ఉన్నత పదవులిచ్చి ఆదరించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు ఎన్టీఆర్ 27 శాతం రిజర్వేషన్స్ ఇస్తే చంద్రబాబు దాన్ని 34 శాతానికి పెంచారని కానీ మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్స్ తగ్గించారని అచ్చెన్న ఆరోపించారు. సిఎం జగన్ కు విభజించి పాలించడం అలవాటైందని, బిసిలకు 54 కార్పొరేషన్స్ ఏర్పాటు చేశామని చెప్పినా అవి నామమాత్రంగానే మిగిలి పోయాయని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిసి గణన జరిగే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.