అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పేరుతో 800 ఎకరాల భూములను సేకరించారని, వీటిలో వంద ఎకరాలు ఎస్సీల నుంచి సేకరించారని, ఎప్పుడో పట్టాలు ఇచ్చిన వారిని ఖాళీచేయించి, వారికి ఊరికి దూరంగా ఎక్కడో కాలవగట్టు మీద స్థలాలు ఇచ్చారని వెల్లడించారు. మరో వంద ఎకరాలు అసైన్డ్ లాండ్స్ సేకరించారని, దాదాపు 70, 80 ఏళ్ళనుంచి సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ ల నుంచి నిర్దాక్షిణ్యంగా లాక్కున్నారని చెప్పారు. వీరికి కనీసం సెంటు స్థలం కూడా అమరావతిలో ఇవ్వలేదన్నారు.
మరో 600ఎకరాలు భూమిని పెద్దల నుంచి సేకరించారని వీరిలో అశ్వినీదత్, రాఘవేంద్రరావు, కేవీ రావు, సీడ్స్ కంపెనీ శ్రీధర్ లాంటి వారు ఉన్నారని, వీరిలో ఒక్కొక్కరికీ అమరావతిలో చెరువు గట్ల మీద, లేక్ వ్యూ ఉండే ప్రాంతాలు అప్పజెప్పారని వివరించారు. ఈ పెద్దల నుంచి సేకరించిన భూమికి ఒక్కో ఎకరానికి 1450 గజాల చొప్పున వారు కోరుకున్నచోట భూములు కేటాయించారని నాని విమర్శించారు. దీనివల్లే అమరావతికి కమ్మరావతి అనే పేరు వచ్చిందన్నారు. గన్నవరం కోసం సేకరించిన భూమిలో బీసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి మాత్రం భూమి ఇవ్వలేదన్నారు.
గ్రాఫిక్స్ తో భామలు సృష్టించి ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగుళూరు,హైదరాబాద్ నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని, విమానాలు, మెట్రో రైళ్ళు, ఆరడుగుల రోడ్లు అంటూ ప్రజలను మైమరపించారని అందుకే భ్రమరావతి అన్నారని కొడాలి పేర్కొన్నారు. సిఎం జగన్ అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే దృక్పథంతో పని చేస్తున్నారని, అందుకే ఈ పరిపాలనా వికేంద్రీకరణకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు నాని స్పష్టం చేశారు.
Also Read : ఉపయోగం లేకపోతే కొడాలి కామెంట్స్