Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందూపురంలో అకవుల కాలం

హిందూపురంలో అకవుల కాలం

మా హిందూపురం అకవుల కథ ఇది. 1989 నాటికి మా ఊరి జనాభా బహుశా డెబ్బయ్ వేలు అయి ఉండాలి. అప్పుడు ఊళ్లో పది మంది కవులనుకునే అకవులం ఉండేవాళ్లం. జనాభా దామాషాలో ఇది పెను ప్రమాద నిష్పత్తి. ఈ పది మందిలో నేనూ ఒకడిని అని చెప్పుకోవడానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నా…అప్పుడు మాత్రం గర్వపడ్డాను. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది కాబట్టి…ఎప్పటికైనా చెప్పక తప్పదు!

కొందరు పద్యాలు, కొందరు పాటలు, కొందరు కవిత్వం, కొందరు కథలు రాసేవారు. నేను అన్నీ రాసేవాడిని. దానికి తోడు నేను జర్నలిస్టును కూడా. (అసలే కోతి…ఆపై కల్లు తాగింది…దానికి తోడు నిప్పు తొక్కింది…వీటన్నిటికీ మించి తేలు కుట్టింది- లాంటి సామెతలకు ఇక్కడ చోటు ఉందో! లేదో!) దాంతో మీడియాలో రెండు లైన్లు వార్త కోసమైనా నన్ను కవిగా అన్ని కార్యక్రమాలకు పిలిచి ముందువరుసలో కూర్చోబెట్టి… ముందుగానే మైకు నా చేతికిచ్చి వారి చావు వారే కొని తెచ్చుకునేవారు. నాకు మైకు ఇచ్చాక ఇక ఎవరికీ మైకు దొరక్క అంతా శూన్యమైపోయేది. బహుశా అందుకే త్వరగా హిందూపురం నుండి నన్ను శాశ్వతంగా బయటికి పంపినట్లున్నారని…నా శ్రేయాభిలాషులకు తరువాత అర్థమయ్యింది. నాకది జీర్ణం కావడానికి చాలా ఏళ్లు పట్టింది!

నా అకవితా జైత్ర యాత్ర నిర్నిరోధంగా సాగుతుండడం వల్లే వరుసగా నాలుగేళ్లు వర్షాలు పడక… హిందూపురం ఎడారి అయిపోయినట్లుగా ఊరి పెద్దలకు తోచింది. ఎవరో వెళ్లి…నాకు తెలుగు, సంస్కృతం వ్యాకరణ పాఠాలు చెప్పిన కర్రా వెంకటసుబ్రహ్మణ్యం సార్ కు నా అకవిత్వ దండయాత్రల గురించి పూసగుచ్చినట్లు చెప్పి…ఎలాగైనా పెద్దమనసు చేసుకుని ఊరిని కాపాడమని అడిగినట్లున్నారు. ఆయన అదను చూసి…బండలు పగిలే ఎండల వేళ ఒక మిట్ట మధ్యాహ్నం నన్ను పిలిచి మామిడి చెట్టు కింద కూర్చోబెట్టి క్లాసు తీసుకున్నారు. నేను రాసేది పద్యం కాదని, శ్లోకం కానే కాదని, పాట కాదని, కథ కాదని, కవిత్వం కాదని సాధారణ సాహితీ ప్రమాణాల సాక్ష్యాలతో నిరూపించి…నాకర్థమయ్యేదాకా చెప్పారు. నా సాధారణ వచన రచనలో కూడా సవాలక్ష తప్పులున్నాయని…అక్షరమక్షరం పట్టుకుని…వెలికి తీసి చెప్పారు.

అప్పుడు నా వయసు ఇరవై. ఇంకెప్పుడూ కవిత్వం రాయకు. ముందు మంచి కవిత్వం చదువు- అని సంస్కృతం, తెలుగులో వాల్మీకి, కాళిదాసు, శంకరాచార్యులు, తిక్కన, పోతన, అన్నమయ్య, వేమన, గురజాడలను పరిచయం చేయించారు. శ్రీనాథుడు, పెద్దన పద్యాల మాధుర్యాన్ని రుచి చూపించారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ విమర్శ లోతుల్లోకి దింపారు. ఆధునికుల్లో విశ్వనాథ, కొడాలి, పుట్టపర్తిల విశ్వరూప సందర్శనం చేయించారు. సరళ వచనంలో కొడవటిగంటి, పాలగుమ్మి పద్మరాజు, మధురాంతకం రాజారామ్, శంకరమంచి సత్యం, మునిపల్లె రాజుల అనన్యసామాన్యమైన శైలి రుచి చూపించారు.

ఇవన్నీ చదివాక, ఆస్వాదించాక, అనుభవించాక కూడా నువ్ రాసింది కవిత్వమే అని నువ్వనుకుంటే నీ ఇష్టం- లోకం గ్రహచారం! ఎప్పుడయినా రాయాలనిపిస్తే అత్యంత సరళమైన వచనంలో వ్యాసాలు మాత్రమే రాయి! కవిత్వం జోలికి వెళ్లకు! అని ఆజ్ఞాపించారు.

నాకు అప్పటికి మా నాన్న తరువాత భాషా సాహిత్యాలకు కర్రా సారే పెద్ద దిక్కు. ఆయన లోకాన్ని రక్షించడంకంటే నా బాగు కోరే చెప్పినట్లు అనిపించి…విన్నాను. ఆ తరువాత 1992లో మెరుగైన అవకాశం కోసం పొట్టచేతపట్టుకుని హిందూపురం వదిలి హైదరాబాద్ వచ్చేశాను. అలా హిందూపురం ఊపిరి పీల్చుకుని…ఎడారి ఛాయలనుండి బయటపడింది. నెమ్మదిగా హిందూపురంలో వర్షాలు కూడా పడడంతో నా అకవిత్వం ప్రభావానికి ప్రబలమైన సజీవ జలసాక్ష్యాలు కూడా దొరికినట్లయ్యింది. అప్పుడు ఎడారి అయిన పెన్న ఇప్పుడు అడపాదడపా పొంగి ప్రవహిస్తోంది.

పేర్లు చెప్పి స్వయం ప్రకటిత హిందూపురం అకవుల గౌరవాన్ని తగ్గించడం నాకు మర్యాద కాదు. పది మంది అకవుల్లో నన్నొక్కడిని ఊరు వదిలించుకుంటేనే ప్రకృతి ఇంతగా పరవశించి…వర్షాలు కురిసి… పంటలు పండుతున్నాయి. మిగతా తొమ్మిది మందిలో వయసువల్ల అయిదుగురు పెన్ను పట్టుకోలేక మానేశారు. మిగతా నలుగురు మాత్రం వదిలిపెట్టలేదు. వారికి కూడా ఎవరైనా మామిడి చెట్టు కింద జ్ఞానబోధ చేస్తే ప్రతి ఏటా వర్షాలు పుష్కలంగా కురిసి హిందూపురం ఇంకా పచ్చగా పంటపొలాలతో, ధాన్యరాశులతో కళకళలాడుతూ ఉండి ఉండేది!

కొసమెరుపు:-
మా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతికి వాటంగా చెంపలు పెట్టి ఈ నలుగురూ ఎప్పుడైనా కవిత్వం చదివితే…కాగల కార్యం గంధర్వులు తీరుస్తారేమో! ఏమో!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్