Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకలవారి చేతిలో విలువయిన కాలం

కలవారి చేతిలో విలువయిన కాలం

Powerful Hand: Watches Worn by the Billionaires – Time Is Money :

కోడి కూస్తే తెలవారుతుందని గుర్తు. కొమ్మల్లో పక్షులు రెక్కలల్లారుస్తూ కిలకిలారావాలు చేస్తే సూర్యుడొస్తున్నాడని సంకేతం. తూరుపు కొండల్లో బంగారు, నారింజ, ఎరుపు రంగులు వచ్చాయంటే సూర్యుడు వచ్చేసినట్లే. పొద్దు పొడిచినట్లే. లేలేత కిరణాలతో లోకాలను సూర్యుడు తట్టి లేపినట్లే. సూర్యుడు నడినెత్తిన ఉంటే మిట్ట మధ్యాహ్నం. పడమటి కొండల్లో మళ్లీ బంగారు రంగు పులుముకున్నాడంటే సాయంత్రమయినట్లే. పగటి దీపం వెలుగు తగ్గిందంటే రాత్రి దగ్గరవుతున్నట్లు. చిమ్మ చీకటి ముసురుకుందంటే బాగా రాత్రయినట్లు. ఆకాశంలో చంద్రుడి స్థానాన్ని బట్టి ఎంత రాత్రయ్యిందో చెప్పేవారు. ఇదంతా మొరటు పద్ధతి.

గోడలకు గడియారాలు వచ్చాయి. చేతికి గడియారాలు వచ్చాయి. సెల్ ఫోన్లు వచ్చాక కెమెరాలు, క్యాలిక్యులేటర్లు, రేడియోలు, డెస్క్ టాపులు మాయమయినట్లే గడియారాలు కూడా మాయమయ్యాయి. చేతిలో సెల్ ఉంటే అన్నీ ఉన్నట్లే… మనం సెల్లులో బందీ అయినట్లే. ఇప్పుడు సెల్లు లేకపోతే మన బతుకు బతుకే కాదు. సెల్లుస్మార్ట్ ఫోన్ పౌరోహిత్యం – వైఫై వేద మంత్రాలు లేని ఇల్లు ఇల్లే కాదు.

ఇదివరకు ఇంటిని చూసి ఇల్లాలిని చూడమనేవారు. ఇప్పుడు సెల్లును చూసి ఆ ఇల్లును చూడమంటున్నారు!

ఇదివరకు కాబోయే అల్లుడు ఆగర్భ దరిద్రుడై ఉంటాడు కాబట్టి ఉంగరం, రిస్ట్ వాచీ, గోచీ, సైకిలు లాంటి అతి సంపన్నుల వస్తువులను కట్నంలో కానుకలుగా అడిగేవారు. వీటి కోసం కాబోయే మామ ఆరు నెలలపాటు మూడు చెరువుల నీళ్లు తాగే వాడు. స్వయం ప్రకాశం లేని కా. అల్లుడు మామగారి ప్రకాశంతో కొన్నాళ్లు వెలిగేవాడు. తరువాత అల్లుడు పాతబడి, అమ్మాయి కొంగుబట్టుకుని తిరిగేప్పుడు అదే అత్తా మామలే అల్లుడిలో స్వయం ప్రకాశం లేని విషయాన్ని స్వయంగా పూసగుచ్చినట్లు వివరిస్తారు- అల్లుడు కూడా తలదించుకుని అంగీకరిస్తాడు – అది వేరే విషయం. కట్నంలో రిస్ట్ వాచీ వస్తుందన్న ఒకే ఒక ఆశతో ఎందరో పురుషోత్తములు పాతికేళ్లుగా చేతికి వాచీ లేకుండా బతికేస్తూ ఉండేవారు.

Time Is Money :

వెయ్యి రూపాయలు పెడితే మామూలు చేతి గడియారం దొరుకుతుంది. నాలుగయిదు వేలు పెడితే ఒక మోస్తరు వాచీ వస్తుంది. పది వేలు పెడితే మేలిమి రకం చేతి గడియారం వస్తుంది. పేదల, మధ్య తరగతి చేతి గడియారాలకు ఇంతకు మించి సీన్ ఉండదు. అదే సంపన్నుల చేతి గడియారాలయితే నాలుగు లక్షల నుండి పాతిక లక్షల దాకా ఉంటాయి. వజ్రాలు పొదిగితే ధర కోటి దాకా కూడా ఉంటుంది.

అన్నమయ్య అన్నట్లు హంసతూలికా తల్పం మీద మహా రాజు నిద్ర ఒకటే- పక్కనే కింద కటిక నేల మీద బంటు నిద్ర ఒకటే. అలాగే వజ్రాల వాచీ ఏడు గంటలు అని నవ్వదు. వెయ్యి రూపాయల వాచీ ఏడు గంటలు అని ఏడవదు. లేదా ముష్టి వాచీలో ఏడే అయితే- వజ్రాల వాచీలో ఎనిమిది కానే కాదు. ఎందులో అయినా ఒకే సమయం కదా అని అనుకోకూడదు. సంపన్నులది విలువయిన సమయం. నిరుపేదలది విలువలేని సమయం. మనిషికి విలువ లేనప్పుడు- వాచితో విలువ పెరిగితే అతని/ఆమె టైమ్ బాగున్నట్లే అనుకోవాలి. మరీ పాతిక లక్షల వాచీ పెట్టుకున్నవారు మాత్రం వంశీ సినిమాల్లోలా వాచీకి ప్రైస్ ట్యాగ్ కూడా తగిలించుకుని తిరిగితే టైమ్ బాగలేని సామాన్యులు కూడా బాగున్న టైమ్ గురించి తెలుసుకుంటారు. లేదా సమయం, సందర్భం లేకుండా ఆ గొప్ప వాచీ పెట్టుకున్నవారే అడగనివారినందరినీ పిలిచి మరీ చెప్పాలి.సంపన్నులు టైమ్ ను కొంటారు.
టైమ్ చూసి కొంటారు.
టైమ్ తో కొడతారు.
టైమ్ తెలియకుండా కొంటారు.
వారి టైమింగ్ ను, వారి టైమ్ సెన్స్ ను అభినందించడం తప్ప మనం చేయగలిగింది లేదు. వారిది రిచ్ టైమ్ కావచ్చు కానీ- మనది పూర్ టైమ్ మాత్రం కాదు. బ్యాడ్ టైమ్ అసలే కాదు. దేనికయినా టైమ్ రావాలి!కరోనాతో భారతదేశంలో అత్యంత ఖరీదయిన చేతి గడియారాల సేల్స్ ఏడాదిగా తగ్గిపోయాయట. ఇప్పుడిప్పుడే మళ్లీ వాటి టైమ్ బాగుందట.

ఈమధ్య పాతిక లక్షల రూపాయల వాచీలు వెంట వెంటనే నాలుగు అమ్ముడుపోయాయట. ఇక కోటి, రెండు కోట్ల వాచీలు కూడా రెండు అమ్ముడుపోతే కరోనా పీడ విరగడ అయి…మంచి టైమ్ వచ్చినట్లేనట!

-పమిడికాల్వ మధుసూదన్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్