బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ సినిమాను తెరకెక్కించాడు. సాహు గారపాటి – హరీశ్ పెద్ది ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ నటించగా, ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించింది. ఇంతవరకూ కామెడీ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమాలు చేసిన అనిల్ రావిపూడి, యాక్షన్ .. ఎమోషన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ‘భగవంత్ కేసరి’ సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకులను నిరాశ పరచలేదు. బాలయ్య అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకోగలిగింది. కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు .. సంగీతం .. బాలయ్య – శ్రీలీల నటన ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. హీరో ఖైదీగా ఉన్నప్పుడు ఒక జైలర్ ఎంతో మానవతా దృక్పథం హెల్ప్ చేసి, తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఆ తరువాత అతను ఒక ప్రమాదంలో చనిపోతాడు. ఆ జైలర్ పట్ల కృతజ్ఞతతో అతని కూతురును హీరో చేరదీసి .. కంటికి రెప్పలా ఎలా కాపాడాడనేదే కథ.
బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ వైపు నుంచి యాక్షన్ .. శ్రీలీల పట్ల అతనికి గల అభిమానం నుంచి ఎమోషన్ .. అతణ్ణి ముగ్గులోకి దింపడానికి కాజల్ చేసే ప్రయత్నాల వైపు నుంచి కామెడీని రాబట్టిన తీరు ఆడియన్స్ కి బాగా నచ్చాయి. ఇక తమన్ మరోసారి విజృంభించాడనే చెప్పాలి. బాణీలతో పాటు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. ఈ దసరాకి గట్టు పాటీ ఉన్నప్పటికీ, ఈ సారి విజేతగా బాలయ్యనే నిలిచాడనే టాక్ థియేటర్ల దగ్గర బలంగానే వినిపిస్తోంది. వసూళ్ల విషయంలో కూడా అదే కనిపిస్తోంది.