పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటం సిగ్గు చేటని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ వింర్శించారు. ఒకవైపు భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నమాజ్ చేస్తామని, మరికొందరు అమ్మవారి ఆలయాన్ని కూల్చేస్తామంటూ రెచ్చగొడుతున్నారని హైదరాబాద్ లో ఆరోపించారు. ప్రజలను రెచ్చగోడుతూనే ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేస్తున్నారని ఇంతకంటే సిగ్గు చేటేముందన్నారు? కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో ఏనాడూ మేం రాజకీయాలు చేయలేదని రాజ సింగ్ స్పష్టం చేశారు. అమ్మవారి విశిష్టత, గొప్పతనాన్ని మేం చాటి చెబుతుంటే…. అందుకు భిన్నంగా ఆలయాన్ని కూల్చేస్తాం… అక్కడే నమాజ్ చేస్తామంటూ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారు. ఆలయాన్ని కూలుస్తానంటే చేతులు ముడుచుకు కూర్చుంటామా? ప్రసక్తే లేదని హెచ్చరించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి శక్తిని, విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతున్న మా పార్టీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. అమ్మవారి ఆలయాన్ని కూలుస్తామన్న నేతలపై కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చర్యలు తీసుకోకుండా సిగ్గులేకుండా బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ద్వంద్వ విధానాలను మానుకొని, భాగ్యలక్ష్మీ అమ్మవారిపైనా, అక్కడే నమాజ్ చేస్తామంటూ రెచ్చగొడుతున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.