గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 10వ తేదిన ప్రారంభం అవుతాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 19వ తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందని ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంత రావు వెల్లడించారు. గణేష్ విగ్రహాల తయారీకి కావాల్సిన ఏకో ఫ్రెండ్లీ, రా మెటీరియల్ అందించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గణేష్ ఉత్సవాలకు 21 రకాల ఔషద మొక్కల కొరత ఉందని, అటవీ శాఖతో మాట్లాడి ఆ మొక్కలను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చూడాలని భగవంత రావు విజ్ఞప్తి చేశారు.
గణేష్ ఉత్సవాల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలన్నారు. కరోన తర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని అన్ని గణేష్ మండపాల నిర్వహకులను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కోరింది. గణేష్ విగ్రహాల ఎత్తు గురించి పోటీ పడకుండా నిమజ్జనానికి సులువుగా ఉండేలా నిరాడంబరంగా ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ఉత్సవాలను విజయవంతం చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. గణేష్ ఉత్సవాల ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేదని, ఉత్సవాలల్లో మాస్ గ్యాదరింగ్ కావొద్దని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంత రావు కోరారు.