కమల్ కథానాయకుడిగా గతంలో వచ్చిన ‘భారతీయుడు’ ఓ సంచలనం. అవినీతి – లంచగొండితనానికి పాల్పడినవారి భరతం పట్టే ప్రతి సీన్ హైలైట్. తండ్రి కమల్ .. కొడుకు కమల్ మధ్య వచ్చే సీన్స్ ఆ సినిమాకి ప్రధానమైన బలం. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అదనపు బలం. అందువల్లనే ఆ సినిమాను గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాము. కానీ ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘భారతీయుడు 2’ మాత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది.
‘భారతీయుడు’ సినిమా విజయంలో ఏయే అంశాలు ప్రధానమైన పాత్రను పోషించాయో, వాటిని శంకర్ వదిలేయడమే ‘భారతీయుడు 2’ పరాజయానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా లవ్ .. రొమాన్స్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్సయ్యాయి. కమల్ చాలా సీరియస్ గా చేసే పనులకు కామెడీ టచ్ ఇవ్వడం శంకర్ చేసిన పెద్ద పొరపాటుగా చెప్పుకున్నారు. అలా చేయడం వలన ఆ క్యారెక్టరైజేషన్ దెబ్బతినడంతో ప్రేక్షకులకు అసంతృప్తి కలిగింది.
ఇక ‘భారతీయుడు 3’ కూడా ఉందనే హింట్ ఇచ్చారు. అయితే ఈ రిజల్టు చూసిన తరువాత ‘భారతీయుడు 3’ సినిమాను పట్టాలెక్కించే సాహసం చేయకపోవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ ఆల్రెడీ ‘భారతీయుడు 3’ కి సంబంధించిన షూటింగు చాలావరకూ పూర్తి చేశారట. అందువలన ప్రేక్షకుల ముందుకు తీసుకురావలసిందే. అయితే థియేటర్లలో దింపుదామా? నేరుగా ఓటీటీ సెంటర్ కి తీసుకెళదామా? అనే ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా టాక్. ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి మరి.