యువ గళం యాత్ర ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు నారా లోకేష్ ప్రయతిస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. లోకేష్ ప్రతి చోటా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని, రాష్ట్రంలో విధ్వంసం చేయడమే చంద్రబాబు లక్ష్యమని, ఐటి నోటీసుల అంశాన్ని పక్కదారి పట్టించడం కోసమే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. భీమవరంలో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పుంగనూరు తరహా రౌడీయిజాన్ని ఇక్కడా చేశారని, వందమంది నుంచి 150 మంది వరకూ రౌడీ మూకలు, కిరాయి వ్యక్తులను తీసుకువచ్చి గొడవలు చేస్తున్నారని, సామాన్య ప్రజలపై కూడా దాడులకు తెగబడ్డారని… ఉంగుటూరులో కూడా ఇలాగే చేశారని విమర్శించారు. తాము ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని వారు చించివేశారని, అయినా తాము సంయమనం పాటించామని, వారి ఫ్లెక్సీలను ఎక్కడా, ఏమీ చేయలేదని అన్నారు. ఈ ఘటనలో వైసీపీశ్రేణులు, పోలీసులు కూడా ఎంతో సమన్వయంతో వ్యవహరించారన్నారు. తాము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని, శాంతి కాముకులమని అన్నారు.
సిఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే సభల్లో జగన్ పై సభ్య సమాజం అంగీకరించని భాష ఉపయోగిస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. భీమవరం ప్రాంతానికి తానొక క్యాన్సర్ గడ్డ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై గ్రంధి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో టిపిడి-జనసేన కుమ్మక్కై పోటీ చేసినా కూడా ప్రజల అభిమానంతో విజయం సాధించి, ఇక్కడి ప్రజల అభిమానం దోచుకున్న గజదొంగనేనని అన్నారు. అవినీతి ఆరోపణలు కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. 52 కోట్లు దోచుకున్నానని, వంద ఎకరాలు ఆక్రమించానని లోకేష్ కు ఎవడు రాసిచ్చాడో తెలియదని, కానీ ఆ ఆస్తులు ఎక్కడున్నాయో దమ్ముంటే చూపాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ తనకు ఓ సొంత ఇల్లు కూడా లేదని, తమ్ముడి ఇంట్లో ఉంటున్నానని.. మరో తమ్ముడు కొంత స్థలం ఇస్తే దానిలో ఆరున్నర కోట్ల రూపాయల లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకున్తున్నానని, అంటే నీకు, నీబాబుకు ప్యాలెస్ లు ఉండాలి కానీ మాకు ఓ చిన్న ఇళ్ళు కూడా ఉండకూడదా అంటూ లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు.