తెలంగాణ ఎన్నికల కోసం ఎట్టకేలకు బిజెపి తొలి జాబితా సిద్దం కావటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. జనసేన పొత్తుతో బరిలోకి దిగుతామని కమలం నేత, ఎంపి కె. లక్ష్మన్ ప్రకటించారు. జనసేనతో జత కలిస్తే సీమాంధ్రుల ఓట్లు దక్కుతాయని బిజెపి నేతల అంచనాగా ఉంది. రాష్ట్ర నేతల అభిప్రాయానికి ఢిల్లీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖమ్మం జిల్లా, రాజధాని శివారు నియోజకవర్గాల్లో ఈ పొత్తు కలిసివస్తుందనే చెప్పవచ్చు. ఒకటి రెండు సామజిక వర్గాలు మినహా సీమాంద్రకు చెందిన అన్ని వర్గాల యువత పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తారు. వీరి ఓట్లతో పాటు తెలంగాణ యువతలో జనసేన అభిమానులు, సానుభూతిపరులు బిజెపి వైపు మొగ్గే అవకాశం ఉంది.
జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు… ఎక్కడ కేటాయిస్తారు అనే అంశంలో స్పష్టత రావల్సి ఉంది. వాస్తవంగా జనసేన తరపున పోటీ చేసే స్థాయిలో ఆ పార్టీ నేతలు లేరనే చెప్పాలి. జనసేన రంగంలోకి దిగితే ప్రధాన పార్టీల్లో సీటు దక్కని ముఖ్య నేతలు ఆ పార్టీ నుంచి ఎన్నికలో బరిలో దిగుతారు.
గెలవగానే కప్పదాట్లు వేసే నేతలు కాకుండా… పార్టీ కోసం నిలబడే వారికి టికెట్లు ఇస్తే తెలంగాణ అసెంబ్లీలో జనసేన గళం వినిపించవచ్చు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత… ఆయన కోసం పవన్ కళ్యాణ్ బాసటగా నిలవటం తెలంగాణలో జనసేనకు కలిసివస్తుంది.
టిడిపి రంగంలో ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. TDP-జనసేన ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు…టిడిపి బిజెపికి వ్యతిరేకంగా బరిలో ఉంటుందా తేలాల్సి ఉంది. నియోజకవర్గాల వారిగా పరిశీలిస్తే బిజెపికి ఓటర్లను ప్రభావం చేసే స్థాయి నేతలు లేరనే చెప్పవచ్చు. జనసేనతో పొత్తు ద్వారా ఆ లోటు కొంత భర్తీ చేసుకునేందుకు బిజెపికి ఉపయోగపడుతుందని ఇరు పార్టీల నేతలు అంటున్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన సీమాంద్ర ఓటర్లు ఈ దఫా మూడు వర్గాలుగా విడిపోయే చాన్స్ ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలు పంచుకునే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే వీరి ఓట్లు చీలికలు పీలికలు జరిగి గులాబీ పార్టీకి మేలు చేయొచ్చు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత నిరుత్సాహంలో ఉన్న కమలం శ్రేణులకు…జనసేనతో పొత్తు ఉత్సాహం ఇస్తుందనే చెప్పవచ్చు. జనసేనాని పవన్ కళ్యాణ్ తో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తే చలి నీళ్ళకు వేడి నీళ్ళు తోడైనట్టు కమలం వికసించేందుకు వాతావరణం అనుకూలించవచ్చు.
బీసీలకు పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ మొదటి లిస్టులో మొండిచేయి చూపింది. మలిదఫా జాబితాల్లో ఎంతవరకు అవకాశం ఇస్తారో తెలియదు. బిజెపి బీసీలకు ప్రాధాన్యత ఇస్తే సగటు ఓటరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రయోగం తెలంగాణలో చేసేందుకు కసరత్తు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం.
-దేశవేని భాస్కర్