Saturday, January 18, 2025
HomeTrending Newsతెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ లకు చెరి సగం ఎంపి సీట్లు

తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ లకు చెరి సగం ఎంపి సీట్లు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీ చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నామమాత్రంగానే పోటీలో నిలిచింది. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నడిచింది. కాంగ్రెస్, బిజెపిలు చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎంఐఎం ఒక స్థానం(హైదరాబాద్)లో ఉంది. మెదక్ లో కొంత పోటీ ఇచ్చినా బీఆర్ఎస్ అన్ని చోట్ల ఓటమి చవి చూసింది.

కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న స్థానాలు

పెద్దపల్లి, జహీరాబాద్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూలు

అధికార పార్టీ కాంగ్రెస్ ను ఫలితాలు కొంత నిరాశ పరిచాయి. రెండంకెల స్థానాలు వస్తాయని ధీమాగా ఉన్న కాంగ్రెస్ కు 8 స్థానాలు రావటం గమనార్హం. నల్గొండలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఐదు లక్షల ఓట్ల ఆధిక్యంతో వెళ్తున్నాడు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యత దక్కింది.

జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కర్ విజయం ఖాయమైంది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తును గెలుపు దిశగా తీసుకెళ్ళారు. నాగర్ కర్నూల్ లో సీనియర్ నేత మల్లు రవి విజయానికి చేరువయ్యారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక అన్నట్టుగా సాగుతోంది.

బీజేపీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, మహబూబ్ నగర్

కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తున్నారు. మెదక్ లో ఓవరాల్ గా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. BJP అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. నిజామాబాదులో బీజేపీ అభ్యర్థి అరవింద్ కి 1,34,232  ఆధిక్యం సాధించారు.

మహబూబ్ నగర్ లో గెలుపునకు సిఎం రేవంత్ రెడ్డి చతురంగ బలగాలు మొహరించినా బిజెపి అభ్యర్థి డీకే అరుణ విజయం దిశగా సాగుతున్నారు. ఆదిలాబాద్ లో గోడెం నగేష్ గెలుపు ఖరారైంది. చేవెళ్ళలో పోయిన సారి ఓటమి చెందిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఈ దఫా గెలుపునకు చేరువలో ఉన్నారు.

ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో విజయం దిశగా సాగుతున్నారు. హైదరాబాదులో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ భారీ ఆదిక్యత దిశగా కొనసాగుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్