రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 217ను వెంటనే రద్దు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అయన లేఖ రాశారు. ఈ జీవో మత్స్యకారుల సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని వీర్రాజు అభిప్రాయపడ్డారు. దీనితో మత్స్యకారుల కుల వృత్తి, జీవన విధానం మారిపోయి వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ జీవో ద్వారా మత్స్యకారులను పాలెగాళ్ళుగా మార్చే కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు అర్ధమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తమ కట్టు బానిసలుగా భావిస్తోందని అయన ధ్వజమెత్తారు. చేపల వేటపై ఆధారపడి జీవించే లక్షలాది కుటుంబాల కడుపుకొట్టి, ప్రభుత్వ పెద్దల అనుచరులకు, అంతరంగీకులకు మత్స్య సంపదను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని అయన ఆరోపించారు.
ఒక వైపున కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఓ మత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి 20 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని, చేపల ఉత్పత్తిని 70లక్షల టన్నులకు చేర్చేందుకు కృషి చేస్తోందని అయన లేఖలో ప్రస్తావించారు. మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి జీవనోపాధిని దెబ్బతీసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవో . రద్దు చేయాలని, లేందంటే మత్స్యకారులతో కలిసి ప్రజాపోరాటం తప్పదని ప్రభుత్వాన్ని బిజెపి తరఫున హెచ్చరించారు.