Sunday, September 8, 2024
HomeTrending NewsBJP Candidates: రాజమండ్రి నుంచి పురందేశ్వరి, రాజంపేట బరిలో కిరణ్ కుమార్ రెడ్డి

BJP Candidates: రాజమండ్రి నుంచి పురందేశ్వరి, రాజంపేట బరిలో కిరణ్ కుమార్ రెడ్డి

పొత్తులో భాగంగా పోటీచేస్తోన్న ఆరు  లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్ధులను భారతీయ జనతా పార్టీ కొద్దిసేపటిక్రితం  ప్రకటించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత; అనకాపల్లి- సీఎం రమేష్; నర్సాపూర్- భూపతిరాజు శ్రీనివాసవర్మ; రాజమండ్రి-దగ్గుబాటి పురందరేశ్వరి; రాజంపేట- మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి; తిరుపతి నుంచి వి వరప్రసాదరావు లను ఎంపిక చేసింది.

పొత్తులో భాగంగా బిజెపి ఆరు ఎంపీ, పది ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం, అరకు, అనకాపల్లి, నర్సాపూర్, రాజమండ్రి, రాజంపేట స్థానాలు బిజెపి తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినా చివరకు విజయనగరం బదులు తిరుపతి బిజెపి ఖాతాలోకి వచ్చింది.

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా, ధర్మవరం నుంచి సత్యకుమార్ కు టికెట్లు కేటాయిస్తూ బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. హిందూపురం లేదా రాజంపేట నుంచి లోక్ సభకు పోటీ చేయాలని సత్యకుమార్, ఏలూరు లేదా విజయవాడ నుంచి బరిలో ఉండాలని సుజనా చౌదరి భావించారు. ఈ మేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే సీనియర్ నేతలంతా లోక్ సభకు పోటీ చేస్తే… క్షేత్రస్థాయిలో బలమైన నాయకుల కొరత ఉంటుందని… అందుకే కొందరు ముఖ్య నేతలు అసెంబ్లీ బరిలో ఉండాలని బిజెపి కేంద్ర నాయకత్వం చేసిన సూచనలను అంగీకరించి వీరిద్దరూ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

ఇక అసెంబ్లీ అభ్యర్ధుల విషయానికి వస్తే

  1. ఎచ్చెర్ల – ఎన్. ఈశ్వర్
  2. విశాఖపట్నం నార్త్ – విష్ణు కుమార్ రాజు
  3. అనపర్తి – సోము వీర్రాజు
  4. కైకలూరు – కామినేని శ్రీనివాస్
  5. విజయవాడ పశ్చిమ  – సుజన చౌదరి
  6. ధర్మవరం  – వై. సత్యకుమార్
  7. జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
  8. బద్వేల్ ఎస్సీ- రోషన్
  9. ఆదోని – పార్థ సారథి పేర్లు ఖరారయ్యారని తెలుస్తోంది. అరకు లేదా పాడేరు స్థానాన్ని బిజెపి తీసుకొని అక్కడి అభ్యర్ధిని ఖరారు చేసిన తరువాత మొత్తం పది పేర్ల జాబితాను ఒకేసారి ప్రకటించనుంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్