పార్టీలో ఏ ఒక్కరో చేరనంతమాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి పార్టీలో చేరడం లేదని ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. పార్టీలో చేరతామని చెప్పి చేరకుండా ఉన్నవారు ఎవరూ లేరని అన్నారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నాయకులు చేరినంత మాత్రాన పార్టీ గెలవబోదని, ప్రజల ఆశీస్సులుంటేనే విజయం సాధ్యమన్నారు. పార్టీకి కచ్చితంగా నాయకులు ఉండాలని, అలా అని ఎవరో చేరకపోతే పార్టీ ఏదో అయిపోతుందన్న భావన సరికాదన్నారు. బిజెపిలో లక్షలాది మంది యువత చేరుతున్నారని చెప్పారు. ఇప్పటివరకూ చేరిన నేతలందరూ పార్టీలోనే ఉంటారని, పార్టీ కోసం పోరాటం చేస్తారని వారెవరూ పార్టీ విడిచి వెళ్ళరని… అనేక మంది కీలక నేతలు పార్టీలోకి వస్తారని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు, నాయకులు ఇద్దరూ అవసరమేనన్నారు.
బిజెపి25 రాష్ట్రాల్లో విజయం సాధించిందని, ఒక రాష్ట్రంలో ఓడిపోయినంత మాత్రాన డీలా పడిపోదని అన్నారు. కాంగ్రెస్ 20 రాష్ట్రాల్లో ఓడిపోయిందని, ఒక రాష్ట్రం గెలిచినంత మాత్రాన ఆ పార్టీకి ఏమైనా కొమ్ములొస్తాయా అని ప్రశ్నించారు. బిజెపి ఎక్కడా నిరాశా నిస్ప్రుహ లకు గురయ్యే పార్టీ కాదని, దేశం కోసం పనిచేసే పార్టీ అని, పోరాటాలు చేయడం తెలిసిన పార్టీ అని వివరించారు.