Babu Direction- BJP AP Action: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక అజెండా అంటూ ఏమీ లేదని చంద్రబాబు అజెండానే అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎక్కడి నుంచో పిలుపు వస్తుంది, ఇక్కడ సభ పెడతారు అంటూ విమర్శించారు. తెలుగుదేశం భావజాలం నరనరానా నింపుకుని బిజెపిలో చేరిన ఇద్దరు నేతల కనుసన్నల్లో నేటి విజయవాడ సభ జరుగుతోందని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు. బిజెపి విజయవాడలో నేడు నిర్వహిస్తున్న ప్రజా ఆగ్రహ సభపై స్పందించారు. బిజెపిలో కొత్తగా వైష్ణవ మతం పుచ్చుకున్న వారు వైసీపీ మీద ఆగ్రహంగా ఉన్నారని, అంతేకానీ ప్రజలకు తమ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎందుకు ఆగ్రహం ఉంటుందని నాని ప్రశ్నించారు. ఒకవేళ బిజెపి సభకు జనం రాకపోతే జనాన్ని పంపే పని కూడా చంద్రబాబే చూసుకుంటారని నాని అన్నారు.
సిఎం జగన్ ప్రజల్లోకి రావడంలేదన్న బిజెపి నేతల విమర్శలను కూడా నాని ఖండించారు. ప్రధాని మోడీ రోజూ జనం మధ్యలోకి వస్తున్నారా అని నిలదీశారు, కేవలం ఓట్ల సమయంలోనే మోడీ బైటకు వస్తారన్నది అందరూ అనుకునే మాట అని ఎద్దేవా చేశారు.
బ్రాందీ రేట్లపై బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలను నాని అపహాస్యం చేశారు. బ్రాందీ కోసం బాధ పడొద్దని, పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ రేట్లపై, నిత్యావసర ధరలపై, ఎరువుల ధరల పెరుగుదలపై ఆలోచించాలని… వీటిపై బిజెపి నేతలకు బాధ లేదా అని నాని అడిగారు. వారికి బ్రాందీ బుడ్డి మీద ఉన్న శ్రద్ధ పోలవరం డ్యాం మీద లేదని…. పోలవరం తామే కడుతున్నామని బిజెపి చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్మిస్తుంటే, నిధులు కేంద్రం మంజూరు చేస్తోందని, అదికూడా అప్పుడప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఇస్తోందని నాని ధ్వజమెత్తారు.
Also Read : నానీ ప్రవచనం